రేసింగ్‌ అంటే ఇష్టం | Nivetha Pethuraj Opens Up About Her Journey in Cinema | Sakshi
Sakshi News home page

రేసింగ్‌ అంటే ఇష్టం

Nov 15 2026 1:20 AM | Updated on Nov 15 2026 1:20 AM

Nivetha Pethuraj Opens Up About Her Journey in Cinema

సినిమా సెట్‌లో అయినా, రేసింగ్‌ ట్రాక్‌పై అయినా, తన దారిలో తాను వేగంగా ముందుకు సాగిపోయే నటి నివేతా పేతురాజ్‌.  తన ప్రపంచం సినిమాలే కాదు, తనకు మరెన్నో ఆసక్తులు, అభిరుచులు ఉన్నాయంటుంది. అలా తన బాల్యం నుంచి వెండితెర ప్రయాణం దాకా దాగిన ఆసక్తికరమైన సంగతులన్నీ ఆమె మాటల్లోనే...

ఏ దుబాయ్‌ నుంచి... హీరోయిన్ గా!
మా ఊరు తమిళనాడులోని కోవిల్‌పట్టి. అయితే నాన్న వ్యాపారం కారణంగా చిన్నప్పుడే కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిపోయాం. అక్కడే పెరిగాను. చదువు, స్నేహితులు, బాల్య జ్ఞాపకాలన్నీ దుబాయ్‌తోనే ముడిపడి ఉన్నాయి. 2015లో ‘మిస్‌ ఇండియా యూఏఈ’ పోటీలో విజేతగా నిలవడం, నాకు కొత్త అవకాశాలకు దారి చూపించింది. అలా మోడలింగ్‌ నుంచి నటన వైపు అడుగులు పడ్డాయి.

ఏ రేసింగ్‌ ట్రాక్‌... నా అడ్డా!
కార్లంటే చాలా ఇష్టం. వేగంగా దూసుకెళ్లే స్పోర్ట్స్‌ కార్లను చూడటమే కాదు, వాటిని నడుపుతాను కూడా! దుబాయ్‌లో ఉన్నప్పుడే రేసింగ్‌ ఈవెంట్లకు వే ళుతూ, రేసింగ్‌ నేర్చుకున్నాను. అంతేకాదు, కోయంబత్తూరులోని ‘మోమెంటమ్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్ డ్‌ రేసింగ్‌’లో ఫార్ములా రేస్‌ కార్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. 

ఏ బాక్సింగ్‌... నా బలం!
ఫిట్‌నెస్‌ కోసం కేవలం జిమ్‌కు వెళ్లడం మాత్రమే కాదు, బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌ వంటి కఠినమైన వ్యాయామాలు కూడా చేస్తాను. వీటితో శరీరానికి బలం రావడమే కాదు, మనసుకూ ధైర్యం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం, నన్ను నేను సవాలు చేసుకోవడం చేస్తుంటాను. 

ఏ అంతరిక్షం... మరో కల!
‘టిక్‌ టిక్‌ టిక్‌’ సినిమాలో స్పేస్‌ నేపథ్యంతో కూడిన పాత్ర చేసే అవకాశం రావడం నాకు కొత్త అనుభవం. స్పేస్‌ సూట్‌ ధరించి నటించడం, అందుకు తగిన శరీర భాషను అలవరచుకోవడం అంత సులభం కాదు. భవిష్యత్తులో అంతరిక్షం నేపథ్యంలో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ముఖ్యంగా కల్పనా చావ్లా వంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే అవకాశం వస్తే అసలు వదులుకోను. 

ఏ హిమాలయాల వైపు... మనసు!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒత్తిడి ఎదురయ్యే సమయాలు ఉంటాయి. నాకూ అలాంటి దశ ఎదురైంది. అప్పట్లో సినిమాలకు దూరంగా, హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ ఉండిపోవాలనే ఆలోచన కూడా వచ్చింది. అయితే, అలాంటి సమయాల్లో మనసుకు నచ్చిన పనులు చేయడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేను అదే చేశాను. 

ఏ నా అసలైన ప్రశాంతత!
జంతువులంటే చాలా ప్రేమ. మా ఇంట్లో ‘టిగీ’ అనే పిల్లి ఉంది. బయట ప్రపంచంలో ఎంత హడావుడి ఉన్నా, ఇంటికి వచ్చాక టిగీతో గడపడమే నా అసలైన ప్రశాంతత! అలాగే, ఖాళీ సమయం దొరికితే ప్రయాణాలు చేస్తుంటాను, పెయింటింగ్‌ వేస్తుంటాను. ప్యారిస్, లండన్ , బ్రెజిల్‌తోపాటు నేను పెరిగిన దుబాయ్‌ నా ఇష్టమైన ప్రదేశాలు.  

ఏ నా దారి... నాదే!
సినిమాల్లో ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. మరొకరిలా మారాలని ప్రయత్నించడం కంటే మనలోని ప్రత్యేకతను గుర్తించి ముందుకు వెళ్లడం ముఖ్యం. తెరపై పవర్‌ఫుల్‌గా, విభిన్నంగా ఉండే పాత్రలు చేయాలనేది నా కోరిక. గ్లామర్‌ పాత్రలతోనే ఆగిపోకుండా, నటిగా కొత్త కోణాలను ఆవిష్కరించుకోవాలని అనుకుంటా.

గాసిప్స్‌కి... గట్టి సమాధానం!
సినిమా రంగంలో ఉన్నవారి గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. కొన్నిసార్లు అవి హద్దులు దాటుతాయి. ముఖ్యంగా నా గురించి దుబాయ్‌లో ఖరీదైన ఇల్లు కొనిచ్చారంటూ వచ్చిన ప్రచారం నన్ను బాధించింది. మా కుటుంబం ఎన్నో ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటోంది. నాన్న అక్కడ వ్యాపారం చేస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా, రాజకీయ వివాదాల్లోకి నటీమణుల పేర్లను లాగడం, కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండటం కంటే నిజం చెప్పడం అవసరమని భావిస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement