‘‘ఆకాశంలో ఒక తార’ మ్యూజిక్ క్వాలిటీగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి మహిళ ఇష్టపడే సినిమా అవుతుంది’’ అని మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్ పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి కథానాయికగా, శ్రుతీహాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రసంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆకాశంలో ఒక తార’కు జాతీయ అవార్డులు వస్తాయని నమ్ముతున్నాను.
ఈ సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘జనవరి 12న విడుదల’ సినిమా మ్యూజిక్ రికార్డింగ్ మొదలు పెట్టాను. సిద్ధు జొన్నలగడ్డగారి సినిమాకు, దుల్కర్ గారి ‘శ్రీశ్రీ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. తమిళంలో నేను నటిస్తున్న ఓ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


