‘‘నటిగా పలు పాత్రల్లో జీవించే అవకాశం ఉంటుంది. సినిమా ఇచ్చే మ్యాజిక్ అదే. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కోసం స్కూల్ డ్రెస్ ధరించాను. ఈ గెటప్‌లో నన్ను నేను చూసుకుని ఆశ్చర్య పోయాను. నా లైఫ్‌లో ఎప్పుడూ అనుభూతి చెందని ఒక ఎమోషన్‌ని ఈ సినిమాతో ఫీల్ కావడం కొత్తగా అనిపించింది’’ అని సాత్విక వీరవల్లి అన్నారు.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. శనివారం విలేకరుల సమావేశంలో సాత్విక వీరవల్లి మాట్లాడుతూ– ‘‘నేను యూఎస్‌లో పుట్టి పెరిగాను.
ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేశాక ఉద్యోగం చేసే టైమ్‌లో క్రియేటివ్ ఫీల్డ్ అయితే బాగుంటుందనుకుని సినిమాల్లోకి రావాలనుకున్నాను. తమిళ చిత్రం ‘కాంత’కు ఆడిషన్ ఇచ్చినా, ఎంపిక కాలేదు. ఆ తర్వాత ఆ సినిమా నిర్మాత మరో తమిళ సినిమా ఉందనడంతో ఆడిషన్ ఇచ్చాను. కొన్ని రోజుల తర్వాత ‘ఆకాశంలో ఒక తార’లో చాన్స్ లభించింది.
దీంతో జాబ్ పక్కన పెట్టి, సినిమాల్లోకి వచ్చాను. మా ఇంట్లో మా నాన్న ఒక్కరే తెలుగు మాట్లాడతారు. అందుకే తెలుగు లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఇక ‘ఆకాశంలో ఒక తార’లో అంతరిక్షంలోకి వెళ్లాలనే లక్ష్యం ఉన్న పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను.
ఎవరెంత కించపరిచినా తన లక్ష్యం వైపే దృష్టి పెట్టే అమ్మాయి పాత్ర ఇది. తొలి రోజు ఒక పెద్ద జాతర సీన్‌లో నటించాల్సి వచ్చింది. సెట్స్‌లో అంతమంది జనాన్ని చూసి ఊపిరి ఆగినట్లయింది. కానీ దుల్కర్‌గారు స పోర్ట్ చేయడంతో చేశాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను’’ అన్నారు.


