టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన సంతాపం తెలిపారు. గిరిబాబు ఇక లేరన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు.
చిరంజీవి: ‘విభిన్నమైన నటన, ప్రత్యేకమైన శైలితో తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గిరిబాబు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. గిరిబాబు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’.
అనీల్ రావిపూడి: గిరిబాబు అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎంతో విలువైనవి. ఆయన ప్రత్యేకమైన నటనాశైలి, గుర్తుండిపోయే పాత్రలు ఎప్పటికీ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతాయి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
పవన్ కళ్యాణ్: ప్రముఖ నటులు శ్రీ గిరిబాబు గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీ గిరిబాబు గారు విభిన్నమైన పాత్రలు పోషించారు. శ్రీ గిరిబాబు కుమారుడు, నటుడు శ్రీ రఘుబాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
(ఇదీ చదవండి: కృష్ణలా ఫోన్ చేయడం ఏ హీరోకి సాధ్యం కాదు: నటుడు గిరిబాబు)


