‘జనన ధ్రువీకరణ’కు 95 ఏళ్ల నిరీక్షణ.. మృత్యువుకు చేరువలో ఊరట! | Houston great Grandfather at 95 he finally Received birth Certificate | Sakshi
Sakshi News home page

‘జనన ధ్రువీకరణ’కు 95 ఏళ్ల నిరీక్షణ.. మృత్యువుకు చేరువలో ఊరట!

Nov 14 2026 8:12 AM | Updated on Nov 14 2026 8:12 AM

Houston great Grandfather at 95 he finally Received birth Certificate

హ్యూస్టన్‌: అమెరికాలో ఓ వృద్ధుడికి 95 ఏళ్ల వయసులో జనన ధ్రువీకరణ పత్రం లభించింది. పుట్టినప్పటి నుంచి దాదాపు తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఆ పత్రం లేకుండానే జీవించిన ఆయనకు.. కుటుంబ సభ్యులు, ఓ న్యాయవాది చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు అధికారిక గుర్తింపు లభించింది. అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన జేమ్స్ డోర్సీ 1931 ఆగస్టులో లూసియానాలోని ఎల్లెర్బే ప్లాంటేషన్‌లో జన్మించారు. అప్పట్లో అమెరికా దక్షిణ ప్రాంతాల్లోని గ్రామీణ నల్లజాతి కుటుంబాల్లో మంత్రసానుల సాయంతో జరిగే ప్రసవాలను ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడం చాలా అరుదుగా జరిగేది. చిన్నతనంలో ఆయన పత్తి పొలాల్లో పనిచేశారు. 1950వ దశకంలో లూసియానా నుంచి హ్యూస్టన్‌కు వలస వెళ్లి అక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేశారు.

అయితే తన జననానికి సంబంధించిన పత్రాలు తల్లి వద్ద ఉన్నాయని ఆయన చాలాకాలం భావించారు. పెళ్లి చేసుకునే సమయంలోనే జనన ధ్రువీకరణ పత్రం లేదని తెలిసింది. ఆ పత్రం లేకపోవడంతో వాణిజ్య వాహనాలు నడిపేందుకు అవసరమైన అర్హతలను కొనసాగించలేక ఉద్యోగాన్ని సైతం వదులుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక పనులు చేసుకోవడమూ కష్టంగా మారింది.

ఈ ఏడాది జూన్‌టీంత్‌ సందర్భంగా అమెరికా టీవీ ఛానల్‌ ‘ఏబీసీ13’ ఆయన సమస్యను వెలుగులోకి తెచ్చింది. దీంతో లూసియానా ఆరోగ్య శాఖ అధికారులు కుటుంబానికి దరఖాస్తు చేసుకునే మార్గాన్ని సూచించారు. కుమార్తె బార్బరా డోర్సీ కర్రీ తండ్రి తరఫున అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ వారాల తరబడి స్పందన రాలేదు. ఈలోగా జేమ్స్‌ 95వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు.

అదే సమయంలో టీవీ కథనం చూసిన ఓ వ్యక్తి న్యాయవాది రైనిక్‌ కీలీన్‌ను సంప్రదించారు. ఆమె ఉచితంగా కేసును స్వీకరించి, రికార్డుల కోసం వెతకగా అసలు విషయం బయటపడింది. జేమ్స్‌ జననం అప్పట్లోనే నమోదైనప్పటికీ.. ఆయన పేరు, పుట్టిన తేదీ తప్పుగా నమోదు కావడంతో అసలు రికార్డును గుర్తించడం కష్టమైంది. న్యూ ఓర్లీన్స్‌ కోర్టును ఆశ్రయించి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసిన ఆమె చివరకు ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించారు.

నవంబర్‌ 14న హ్యూస్టన్‌లోని జేమ్స్‌ ఇంటికి స్వయంగా వెళ్లి ఆ పత్రాన్ని అందజేశారు. దాదాపు 95 ఏళ్ల నిరీక్షణకు తెరపడటంతో జేమ్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన ఉనికికి, అమెరికా పౌరసత్వానికి అధికారిక ఆధారం లభించిందని న్యాయవాది పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఈ పరిణామాన్ని జీవితకాల కల నెరవేరినట్లుగా అభివర్ణించారు.

ఇదీ చదవండి: సోనియాపై అనుచిత వ్యాఖ్యలు.. కంగనాపై ఎఫ్ఐఆర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement