గోల్‌కీపర్‌ ఢీకొని... ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మృతి | Spanish footballer dies after collision with goalkeeper | Sakshi
Sakshi News home page

గోల్‌కీపర్‌ ఢీకొని... ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మృతి

Nov 4 2026 4:05 AM | Updated on Nov 4 2026 4:05 AM

Spanish footballer dies after collision with goalkeeper

బార్సిలోనా: ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన ఊహించని ఘటనతో టెనెరిఫ్‌ క్లబ్‌కు చెందిన ఫార్వర్డ్‌ ఆటగాడు 30 ఏళ్ల జెసస్‌ డీ మిగెల్‌ మృతి చెందాడు. స్పెయిన్‌ రెండో డివిజన్‌ లీగ్‌లో భాగంగా సోమవారం టెనెరిఫ్, అండోరా జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ అదనపు సమయంలో బంతిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్న టెనెరిఫ్‌ క్లబ్‌ ఆటగాడు డీ మిగెల్‌ను అండోరా జట్టు గోల్‌కీపర్‌ జెసస్‌ ఒవోనో దురుసుగా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో గోల్‌కీప్‌ మోకాలు మిగెల్‌ ఛాతీ భాగంలో బలంగా తగిలింది. దీతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రెఫరీ తక్షణమే గోల్‌కీపర్‌ ఒవోనోకు రెడ్‌కార్డ్‌ చూపించి మ్యాచ్‌ను నిలిపివేశారు. 

మిగెల్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. వైద్యం అందిస్తున్న క్రమంలో మంగళవారం ఉదయం మిగెల్‌ మృతి చెందినట్లు క్లబ్‌ ప్రకటించింది. ఈ అనూహ్య ఘటనపై టెనెరిఫ్‌ క్లబ్‌తో పాటు రియల్‌ మాడ్రిడ్, లివర్‌పూల్, మాంచెస్టర్‌ యునైటెడ్‌ వంటి ప్రముఖ జట్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ మంగళవారం జరగాల్సిన పలు మ్యాచ్‌లను వాయిదా వేసింది. మాడ్రిడ్‌కు చెందిన డి మిగెల్‌... 2015లో లెగానెస్‌ జట్టు తరఫున ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించాడు. అప్పటి నుంచి స్పెయిన్‌లోని పలు సెకండ్‌ డివిజన్‌ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement