ఫండే
సందేహం
హెల్త్
నాకు పదిహేడేళ్లు, మూడేళ్ల క్రితమే మొదటిసారి నెలసరి మొదలైంది. ఒక ఏడాది నుంచి నెలసరి రెండు నెలలకొకసారి క్రమం తప్పుతోంది. ఇదేమైనా సమస్యా? ఇది భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
– విజయలక్ష్మీ, గుంటూరు
ప్రతి నెలసరి ఆలస్యమైనా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వయసుల్లో హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరగవచ్చు. మరి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి? ఇందుకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వంటి ఇతర విషయాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం...
ఈ దశల్లో సాధారణమే!
మొదటిసారి నెలసరి వచ్చిన తర్వాత మొదటి రెండుమూడేళ్లలో హార్మోన్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో పరిపక్వం చెందడానికి సమయం పడుతుంది. అందుకే కొందరిలో నెలసరి క్రమం తప్పవచ్చు. అలాగే, ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చే సమయంలోనూ, మెనోపాజ్‌కు ముందు దశలోనూ హార్మోన్ల మార్పుల వల్ల నెలసరిలో తేడాలు రావచ్చు.
లక్షణాలుంటే జాగ్రత్త!
మూడు నెలలకు పైగా నెలసరి రాకపోయినా, తరచు క్రమం తప్పుతున్నా వైద్యులను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఎనిమిది పది రోజులకుపైగా రక్తస్రావం కొనసాగడం, అధికంగా బ్లీడింగ్ కావడం, తీవ్రమైన కడుపునొప్పి, తల తిరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే అకస్మాత్తుగా బరువు పెరగడం, ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా రావడం, మొటిమలు పెరగడం, జుట్టు రాలడం వంటివి కనిపించినా పరీక్షలు అవసరమవుతాయి. గతంలో క్రమంగా వచ్చిన నెలసరి అకస్మాత్తుగా ఆగిపోయినా వైద్యులను సంప్రదించాలి.
హార్మోన్ల అసమతుల్యతేనా?
నెలసరి క్రమం తప్పడానికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో మార్పులు, థైరాయిడ్ సమస్యలు, ప్రోలాక్టిన్ హార్మోన్ పెరగడం వంటి కారణాలు ఉండవచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య రావచ్చు. దీనివల్ల అండాశయాల్లో ఆండ్రోజెన్ హార్మోన్లు పెరిగి, అండం విడుదలకు ఆటంకం కలిగి, నెలసరి క్రమం తప్పుతుంది. అయితే పీసీఓఎస్ ఒక్కటే కారణం కాదు. ఇతర హార్మోన్ల సమస్యలను కూడా పరిశీలించాలి.
ఏ పరీక్షలు చేయించుకోవాలి?
ముందుగా నెలసరి ఎప్పటి నుంచి క్రమం తప్పుతోంది? రక్తస్రావం ఎలా ఉంటోంది? బరువులో మార్పులున్నాయా? ఇతర లక్షణాలేమైనా ఉన్నాయా? వంటి వివరాలను వైద్యులు తెలుసుకుంటారు. అవసరాన్ని బట్టి థైరాయిడ్, ప్రోలాక్టిన్ , హిమోగ్లోబిన్ , రక్తంలో చక్కెర పరీక్షలు చేస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా అండాశయాలు, గర్భాశయం లోపలి పొరను పరిశీలిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్ వంటి హార్మోన్ పరీక్షలూ అవసరమవుతాయి. అయితే, ప్రతి ఒక్కరికీ అన్ని పరీక్షలూ అవసరం ఉండవు.
భవిష్యత్తుపై ప్రభావం!
పీసీఓఎస్ వంటి సమస్యల వల్ల అండం సక్రమంగా విడుదల కాకపోతే భవిష్యత్తులో గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిలో మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యల ప్రమాదమూ పెరుగుతుంది. నెలసరి చాలా కాలం రాకపోతే గర్భాశయం లోపలి పొర మందం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి.
జీవనశైలిలో మార్పులు
ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు వైద్యులు లేదా డైటీషియన్ సూచనలతో బరువును నియంత్రించుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ప్యాకేజ్డ్ స్వీట్లు, జంక్‌ఫుడ్ తగ్గించి చిరుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నట్స్, విత్తనాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజులు 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, తగిన వ్యాయామం చేయడం మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు రోజూ తగినంత నిద్రపోవాలి.
మందులు ఎప్పుడు అవసరం?
సమస్యకు గల కారణం, తీవ్రత, వయసును బట్టి చికిత్స మారుతుంది. కొందరికి జీవనశైలిలో మార్పులే సరిపోవచ్చు. మరికొందరికి హార్మోన్ మందులు లేదా ఇతర ఔషధాలు అవసరమవుతాయి. రక్తస్రావం ఎక్కువగా ఉన్నా, పీసీఓఎస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా వాటికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. భవిష్యత్తులో గర్భం దాల్చాలనుకునేవారికి అండం విడుదలయ్యే ప్రక్రియను మెరుగుపరచే చికిత్స సూచించవచ్చు.
చివరగా.. నెలసరి ప్రతినెలా ఒకే తేదీకి రావాల్సిన అవసరం లేదు. అయితే పదేపదే క్రమం తప్పుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. కారణాన్ని గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడమే ఆరోగ్యకరమైన నెలసరికి మార్గం.
- డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్
ఇదీ చదవండి: తొందరపాటు బుజ్జాయిలు


