ఆఫీసులోకి ఈగ వచ్చింది.. బిలియనీర్‌ ప్రాణం తీసింది! | Micro Drone Fly Murder Mystery Story | Sakshi
Sakshi News home page

ఆఫీసులోకి ఈగ వచ్చింది.. బిలియనీర్‌ ప్రాణం తీసింది!

Nov 15 2026 11:36 AM | Updated on Nov 15 2026 11:50 AM

Micro Drone Fly Murder Mystery Story

ఫండే

క్లూషియల్‌

ఆరు అంతస్తుల ఎత్తయిన భవనం...
వేలాదిమంది ఉద్యోగులు... వందలాదిమంది పనివాళ్ళతో ఎప్పుడు హడావిడిగా ఉండే ‘మెహతా ఛాంబర్స్‌’.
ఆరోజు ఉద్యోగులతో మాత్రమే కాకుండా, పోలీసుల బూట్ల చప్పుడుతో, అంబులెన్సు సైరన్లతో హడావిడిగా ఉంది. కారణం, నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త బిలియనీర్‌ రాజేంద్ర మెహతా మరణం.

అతడి మరణం నగరంలోనూ, వ్యాపార రంగంలోనూ కలకలం రేపింది. వ్యాపార రంగంలో అజాతశత్రువుగా పేరు గాంచిన రాజేంద్రకి వ్యాపారమే ప్రపంచం. తన ఆఫీసు ఆరవ అంతస్తులో ఉన్న ఖరీదైన గ్లాస్‌ చాంబర్‌లో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు కళ్ళు ఆ గ్లాస్‌ చాంబర్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎక్కడ కూడా చిన్న చీమ కూడా జొరబడలేని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఆ చాంబర్‌ ఉంది. కానీ ఏదో తెలియని అనుమానం అభిమన్యుని వెంటాడుతోంది.

పోస్టుమార్టం నివేదికలో రాజేంద్ర మెహతా పొటాషియం సైనేడ్‌ వల్ల  మరణించాడని వచ్చింది. అక్కడ ఉన్న అందరినీ విచారించాడు అభిమన్యు. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ రాజేంద్ర చాంబర్‌లోకి వెళ్లనేలేదు. ఆ విషయం సీసీ ఫుటేజీలో కూడా స్పష్టమవుతోంది.  
బయట కట్టుదిట్టమైన సెక్యూరిటీ– పైగా గ్లాస్‌ ఛాంబర్‌కు డిజిటల్‌ లాక్‌ ఉంది. లాక్‌ ఓపెన్‌ చేయకుండా, లోపలకు ఎవరూ ప్రవేశించకుండా మెహతా ఎలా చనిపోయాడు?

అభిమన్యు మెదడు శరవేగంగా ఆలోచిస్తోంది. ఆ గ్లాస్‌ చాంబర్‌లోకి మళ్లీ అడుగుపెట్టాడు. అక్కడే ఏదో జరిగి ఉండాలి. అదేమిటో తెలుసుకోవడానికి అణువణువూ పరిశీలించసాగాడు. ఉన్నట్టుండి అభిమన్యు చూపు ఆ చాంబర్‌ కిటికీ మీద పడింది. అక్కడి నుంచే ఏదైనా జరిగి ఉంటుందనే ఆలోచన తట్టింది.

సీసీ ఫుటేజీని మరోసారి జాగ్రత్తగా గమనిస్తున్నాడు అభిమన్యు. గాజు కిటికీ పైభాగం నుండి ఒక ఈగ చాంబర్‌లోకి ప్రవేశించడం గమనించాడు అభిమన్యు. అది తప్ప అక్కడ ఇంకేమీ కనిపించడం లేదు. ఆ ఈగను చూడగానే అభిమన్యుకి చిక్కుముడి విడిపోతున్నట్టుగా అనిపించింది. వెంటనే ఆ గాజు కిటికీ వద్దకు ఒక స్టూల్‌ మీద నిలబడి చూశాడు. తన అనుమానం నిజమే అన్నట్టుగా అభిమన్యు కళ్ళు పెద్దవయ్యాయి. 

వెంటనే సైంటిఫిక్‌ టీమ్‌ను పిలిపించాడు.  వాళ్ళు ఆ గాజు కిటికీ వద్ద ఉన్న ఏసీ ఎగ్జాస్ట్‌ హోల్‌ వద్ద ఉన్న సన్నటి కార్బన్‌ ఫైబర్‌ పొడిని స్వాధీనం చేసుకున్నారు. అభిమన్యు– ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ను పిలిచి ఏం చేయాలో చెప్పాడు. సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.
అతను చెప్పింది విని మరోసారి కన్ఫర్మ్‌ చేసుకున్నాడు అభిమన్యు.

రాజేంద్ర మెహతా విల్లా ... పనివాళ్లంతా విచారంలో ఉన్నారు. వారందరిని చూస్తూ అభిమన్యు దూరంగా నిలబడి వెక్కివెక్కి ఏడుస్తున్న మెహతా మేనల్లుడు అమర్‌ను చూస్తూ, ‘ఏడవడం అయిపోతే ఇక బయలుదేరుదాం’ అన్నాడు. ‘ఎందుకు సర్‌?’ ఆశ్చర్యంగా అన్నాడు అమర్‌.

‘మీ మామయ్యను హత్య చేసినందుకు’... తాపీగా చెప్పాడు అభిమన్యు.
‘నేను మా మామయ్యను హత్య చేయడం ఏమిటి?’ ఎదురు ప్రశ్నించాడు అమర్‌.
‘ఈగ ద్వారా హత్య చేయించినందుకు...’ అన్నాడు అభిమన్యు. ఆ మాటలు వినగానే అమర్‌ మొహం పాలిపోయింది.  
ఇంకేదో మాట్లాడబోతున్న అమర్‌ ను ఆగమంటూ..

‘నీ క్రిమినల్‌ ఐడియా చెప్పమంటావా...  మిస్టర్‌ అమర్‌...’ అంటూ చెప్పడం ప్రారంభించాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు.
‘ఈగ రూపంలో అత్యాధునికంగా... శబ్దం చేయని  మైక్రో డ్రోన్‌ని మీ మామయ్య మీద ప్రయోగించి అతడి ప్రాణం తీశావు. తన ఆస్తి మొత్తాన్ని నీ పేరుతో కాకుండా చారిటీకి ఇవ్వాలనే మీ మామయ్య ఆలోచన నీకు ఇష్టం లేక ఈ పని చేశావు.’
మెహతా ఆఫీస్‌కి అర కిలోమీటర్‌ దూరంలో కారులో కూర్చుని నువ్వు వీఆర్‌ గ్లాసెస్‌ ధరించి ఆ మైక్రో డ్రోన్‌ని రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేశావు.

అరకిలోమీటరు దూరంలో నువ్వు కారులో కూర్చున్న విజివల్స్‌ అక్కడి సీసీ ఫుటేజ్‌లో వుంది.
దూరం నుండి చూసేవాళ్ళకి ఆ మైక్రో డ్రోన్‌ ఈగలాగా కనిపిస్తుంది. అది గ్లాస్‌ చాంబర్‌లోని కిటికీలోంచి ప్రవేశించి రాజేంద్ర మెడమీద వాలి పొటాషియం సైనేడ్‌తో నిండి ఉన్న పాయిజన్‌ డార్ట్‌ను దింపింది. ఆ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా డ్రోన్‌ దానంతట అదే ఆటోమేటిక్‌ ఆత్మహత్య (సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌)  చేసుకుని కాలిపోయేలా డ్రోన్‌ను సెట్‌ చేశావు.

కానీ సైన్స్‌ – టెక్నాలజీ ఉపయోగించి హత్య చేస్తే,  అదే సైన్స్‌ – టెక్నాలజీ నిన్ను పట్టించింది. ఎప్పటికైనా నేరానికి శిక్ష తప్పదు’ అని చెప్పి అభిమన్యు ముందుకు కదిలాడు.

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: వెయ్యేళ్ల తర్వాత ప్రయాణానికి... ముందుగానే టికెట్‌ జారీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement