డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ? | Aakasamlo Oka Tara debut opposite Dulquer Salmaan who is Satvika Veeravalli | Sakshi
Sakshi News home page

డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ?

Nov 20 2026 1:08 PM | Updated on Nov 20 2026 1:08 PM

Aakasamlo Oka Tara debut opposite Dulquer Salmaan  who is Satvika Veeravalli

Aakasamlo Oka TaraSatvika Veeravalli  'ఆకాశంలో ఒక తార' సినిమాతో రంగప్రవేశం చేసిన సాత్విక వీరవల్లి   డెబ్యూ మూవీతోనే సెన్సేషన్‌గా మారిపోయింది.   పవన్ సాదినేని దర్శకత్వంలో,  హీరో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా  తెరంగేట్రం చేసిన సాత్విక వీరవల్లి తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఎవరీ సాత్విక వీరవల్లి? ఆమె నేపథ్యం ఏంటి? అంశాలు  నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

ఇండియన్‌ అమెరికన్‌ సాత్విక అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, నటనలో కెరీర్‌ను ఎంచుకోవడం యాదృచ్ఛికంగా జరగలేదు. సాత్విక అమెరికాలోనే పుట్టి పెరిగింది.  ఇల్లినాయిస్ ఉర్బానా-ఛాంపెయిన్ విశ్వవిద్యాలయం నుండి డిజైన్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది.  తరువాత  వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. సాత్విక మంచి డ్యాన్సర్. చెన్నైకు చెందిన ఈమె తల్లి వనిత భరతనాట్యం టీచర్ కావడంతో,  బాల్యం తల్లి వద్దే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.

లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సినిమాల్లోకి రాకముందు, సాత్విక 'ఒరాకిల్ సెర్నర్' (Oracle Cerner) సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా, ఇంటర్‌ ఆపరేబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. హెల్త్‌కేర్ టెక్నాలజీ  అండ్‌  ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులలో, ముఖ్యంగా సిస్టమ్‌ల మధ్య డేటా మార్పిడిని మెరుగుపరిచే విభాగంలో ఆమె విధులు నిర్వర్తించింది. చివరికి  లక్షల రూపాయల జీతాన్నిచ్చే   కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది.

 తొలుత పీహెచ్‌డీ లేదా ఎంబీఏ చేయాలని అనుకున్నానని, కానీ న్యూయార్క్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలు తమ కార్పొరేట్  కెరీర్‌ను కొనసాగిస్తూనే కళారంగంలో కూడా ఎలా రాణిస్తున్నారో గమనించానని తెలిపింది. అప్పుడే తనకు కూడా నటనపై ఆసక్తి కలిగిందని  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాత్విక  వెల్లడించింది. అంతేకాదు  అంతకుముందు దుల్కర్ సల్మాన్ నటించిన మరో చిత్రం 'కాంత' (Kaantha) కోసం కూడా ఆడిషన్ ఇచ్చానని, అయితే అందులో అవకాశం రాలేదని సాత్విక తెలిపింది.

 

'ఆకాశంలో ఒక తార'లో కల్పనగా
'ఆకాశంలో ఒక తార' చిత్రంలో సాత్విక వ్యోమగామి కావాలని కలలు కనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది. ఈ పాత్ర అమెరికాలో పెరిగిన ఆమె నిజజీవిత వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైనది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సిద్ధమవుతున్నప్పుడు, ఆ పాత్ర నేపథ్యాన్ని, తన కలకు సంబంధించిన సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవాల్సి వచ్చిందని ఆమె గతంలో తెలిపింది.కథలోని కొన్ని శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి తన ఇంజనీరింగ్ చదువు ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొంది.

ఈ సినిమా కోసం ఆమె తెలుగు భాషపై పట్టు సాధించడానికి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. తన కుటుంబ నేపథ్యం వల్ల తెలుగు నేర్చుకోవడం సులువైందని చెప్పింది. తన తొలి సినిమా షూటింగ్ సమయంలో దుల్కర్ సల్మాన్ ఎంతో ప్రోత్సహించారని సాత్విక తెలిపింది. మొదటి రోజు షూటింగ్‌లో తాను చాలా కంగారు పడ్డానని, అయితే దుల్కర్ తన భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పారని గుర్తుచేసుకుంది.

మరిన్ని అవకాశాలు 
సాత్విక తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆమె తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని సినిమాలకు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. , ముఖ్యంగా నాగ చైతన్య హీరోగా దర్శకుడు క్లాక్స్ (Clax) తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో సాత్వికకు అవకాశం దక్కినట్టు నిర్మాత అల్లు అరవింద్  ధృవీకరించారు.  వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి.

'ఆకాశంలో ఒక తార' సినిమాలో శ్రుతి హాసన్, రుహానీ శర్మ, శ్వాసిక విజయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మురళీ శర్మ, కోట జయరాం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement