breaking news
Indian classical music
-
ఉత్తర–దక్షిణ వారధి
ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనలో ఓ బాలుడు తొలి కచేరీ ఇచ్చాడు. కేటాయించింది ముప్పై నిమిషాలే అయినా, శ్రోతలు కాలగమనాన్నే మరిచిపోయేలా ఆ కచేరీ మూడు గంటలపాటు సాగిందని చెబుతారు. ఆ గానం విన్న హరికథా విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ మూర్తి భాగవతార్, ఆ ‘మురళీకృష్ణ’ అన్న అతడి పేరుకు ‘బాల’ను జోడించారు. అప్పటి నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు.1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి, మున్ముందు భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం పదిహేనేళ్ల వయసులో 72 మేళకర్త రాగాలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రతి రాగంలోనూ కృతులు రచించారు. ఆ కృతుల సంకలనమే ‘జనక రాగ కృతి మంజరి’. వర్ణాలు, కృతులు, థిల్లా నాలు, భావగీతాలతో కలిపి 400కు పైగా రచనలు చేసిన ఆయన, తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాష ల్లోనూ సమానమైన సౌందర్యంతో స్వరపరిచారు.కొత్త రాగాలు–తాళాలు‘సంప్రదాయం అంటే స్తబ్ధత కాదు, అది సజీవ ప్రవాహం’ అన్నదే బాలమురళి దృక్పథం. ప్రాచీన సంప్రదాయపు మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే ఆయన కొత్త సరిహద్దులను తాకారు. మహతి, లవంగి, గణపతి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, ఓంకారి వంటి సరికొత్త రాగాలను సృష్టించారు. వీటిలో కొన్ని కేవలం మూడు లేదా నాలుగు స్వరాలతోనే రూపొందినవి. అంతేకాదు, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి సరికొత్త తాళ పద్ధతులకు ఆయన ప్రాణం పోశారు.మూడు అష్టకాల విస్తృతి, అపార గాంభీర్యం, స్ఫటికంలాంటి స్పష్టమైన ఉచ్చారణ, గమకాల్లో అసాధారణ నైపుణ్యం ఆయనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు ఇచ్చిన ఆయన, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిశోరీ అమోన్కర్ వంటి హిందు స్థానీ దిగ్గజాలతో జుగల్బందీలు నిర్వహించి, ఉత్తరాది–దక్షిణాది సంగీతాలకు వారధిగా నిలిచారు. గాత్రంతో పాటు వయోలిన్, వీణ, మృదంగం, కంజీరా, వయోలాలను అద్భుతంగా వాయించారు. ఆకాశవాణిలో ఏడు వేర్వేరు ప్రదర్శన విభాగాల్లో ‘టాప్ గ్రేడ్’’ సాధించిన ఏకైక సంగీతకారుడిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ని విదేశీ గాయక బృందంతో కలిసి ఆలపించడం, రవీంద్ర సంగీతాన్ని బెంగాలీలో రికార్డు చేయడం, జాజ్ ఫ్యూజన్ ప్రయో గాలు చేయడం, ఆయన సంగీత పరిధికి హద్దులే లేవని చాటిచెప్పాయి. వెండితెరపైనా బాలమురళి తనదైన ముద్ర వేశారు. 1967లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రలో నటిస్తూ, ‘ఆది అనాదియు నీవే దేవా’ వంటి అమర గీతాలు ఆలపించారు.పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ అందుకున్న అరుదైన కర్ణాటక సంగీత మహనీయుడు ఆయన. ఫ్రా¯Œ్స ప్రభుత్వపు ‘షెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ వంటివి ఎన్నో అందుకున్న ఆయన 2016 నవంబర్ 22న చెన్నైలో కన్ను మూశారు. కానీ ఆయన స్వరం, కృతులు, రాగాలు సజీవంగా మారుమోగుతూనే ఉన్నాయి. – డా కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి) -
Ayodhya Ram Mandir: ఆహూతులను ఆకట్టుకున్న నృత్య, సంగీత ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన నృత్య, సంగీత,నాటక ప్రదర్శనలు మంత్రిముగ్ధుల్ని చేశాయి. రామ చరితతోపాటు, 500 ఏళ్ల నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ట వరకు జరిగిన విశేషాలను ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. ‘బధాయ్, చారీ, గూమర్, భవాయ్, ఝుమర్, ధోబియా, రాయ్, రస్లీల, మయూర్, ఖయాల్ నృత్యం, సతారియా’వంటి జానపద నృత్యాలతో కళాకారులు అమితానందం కల్గించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి, మోహని ఆట్టం, కథాకళి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగిసేదాకా ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు ఈ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలను సెల్ఫోన్లలో బంధించారు. చలనచిత్ర, సంగీత కళాకారులు బాల రాముడిపై అభిమానాన్ని పాటల రూపంలో చాటారు. ప్రముఖ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, సోను నిగమ్ ‘రామ్ భజన్’ చేశారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తీ ‘రామాష్టకం’తో అలరించారు. ‘రాం సియా రాం’ అంటూ సోను నిగం పాడిన పాట ఆకట్టుకుంది. -
శతతంత్రుల మాంత్రికుడు
భారత శాస్త్రీయ సంగీతానికి మే 10 అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి. పండిట్ రాజన్ మిశ్రా, పండిట్ బిర్జూ మహారాజ్‌ల తర్వాత... ఆ రోజున మనం మరొక సంగీత దిగ్గజం పండిట్ శివకుమార్ శర్మను కోల్పోయాం. ఏళ్ల క్రితం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో సితార్, సరోద్, వయోలిన్లు ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో పండిట్ శివకుమార్ శర్మ శతతంత్రీ వీణ (సంతూర్) ఆ మూడు వాద్యాలకు సమవుజ్జీగా స్థానం సంపాదించిందంటే ఆ ఘనత శర్మాజీదే. 60–70 ఏళ్ల క్రితం సంతూర్ అనే ఈ జమ్మూకశ్మీర్ పల్లెసీమల, జానపదుల సూఫీ సంగీతపు నూరు తంత్రుల పక్క వాద్యాన్ని శర్మాజీ అత్యద్భు తంగా మలిచి, పలికించారు. ప్రతి కొత్త విషయానికి జరిగినట్లే ఇక్కడా జరిగింది. అందుకు నేనొక సాక్షిని. సంతూర్ అనే ఆ కొత్త పరికరం గురించి ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేశారు. సంతూర్ ధ్వనిలో భారత శాస్త్రీయ సంగీత సారాంశం లేదని పెదవి విరిచారు. గమకాలు, స్వర విరామాలు శ్రావ్యంగా లేవని అన్నారు. కానీ పండిట్ శర్మ ఆ వాద్యానికి, వాద్య ధ్వనికి ఏకంగా దేవశ్రుతినే కల్పించారు. కుడిచేతి బొటనవేలితో తంత్రుల్ని మూర్ఛనలు పోనిచ్చారు. ఉదాహరణకు, రూపకతాళం అనే ఒక్క ఏడు లయల భావాంశం లోనే పండిట్జీ ఝప్తాల్ (10 బీట్లు), ఏక్ తాల్ (12 బీట్లు), తీన్ తాల్ (16 బీట్లు) కూడా పలికించేవారు. పండిట్జీ కొద్దిమాటల మనిషి. ప్రశాంతంగా, మౌనంగా, మర్యాదగా, వినయంగా ఉండేవారు. కచేరీ ప్రారంభానికి ముందు వేదిక తెరల వెనుక ధ్యానముద్రలోకి వెళ్లిపోయేవారు. ఆలోచనల్ని వేళ్లలోకి తెచ్చేసుకునేవారు. ఎంతటి మాటల పొదు పరి అయినా సహ కళాకారుల గురించి ఆరా తీసేవారు. వారిని ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఎవర్నయినా విమర్శించడం నేను ఎప్పుడూ చూడ లేదు. ఆయనలో హాస్య ప్రియత్వం ఉండేది. ఒకసారి ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూకి ముందు ‘నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి’ అని అన్న ప్పుడు, పండిట్జీ ఇలా సమాధానమిచ్చారు: ‘క్షమిస్తాను. ముందు మీరు తప్పు చేయండి’. శర్మాజీ మొదట్లో తబలా వాద్యకారులు. 1950వ దశకం చివరిలో మా కుటుంబానికి యువ శర్మ గురించిన తొలి జ్ఞాప కాలలో ఒకటి... మా అన్నగారు, సితార్ వాద్యకారుడు పండిట్ శశి మోహన్ భట్ జమ్మూలో ఆల్ ఇండియా రేడియో షో కోసం రికార్డింగ్ చేస్తున్నప్పుడు శివకుమార్ శర్మ తబలా వాయించడం! సంవత్సరాల తరువాత శర్మాజీ, నేనూ ఒకే కచేరీలో వాద్యకారు లుగా కలుసుకున్నాం. ఆయన పండిట్ హరిప్రసాద్ చౌరాసి యాతో (శివ్–హరిగా) కలిసి యుగళ గీతాలకు సంతూర్ స్వర ప్రతిష్ఠ చేసేవారు. నేనప్పటికి జూనియర్ ఆర్టిస్ట్‌ని మాత్రమే! శర్మాజీ, నేను కలిసి ఎప్పుడూ యుగళ గీతాలను పలికించలేదు. కానీ మేము ఒకే విమానంలో న్యూయార్క్‌లోని భారతీయ విద్యా భవన్లో కచేరీలకు, ఎ.ఆర్. రెహమాన్ ‘జనగణమన’ వీడియో షూట్ల కోసం లేహ్, లద్దాఖ్, మాంట్రియల్‌కు వెళ్లాం. పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ ఏర్పాటు చేసిన టెలివిజన్ షో రికార్డింగ్‌లో ఆమె నా పేరును ప్రస్తావించినప్పుడు, పండిట్ శివ కుమార్ శర్మాజీ... ‘అతను మోహన వీణను ప్రపంచమంతటికీ తీసుకెళ్లాడు’ అని నా పరిచయానికి జోడింపునిచ్చారు. నేను గ్రామీ (1994) గెలుచుకున్నప్పుడు ‘నువ్వు గొప్పగా చేశావు’ అన్నారు. ఆయన్నుంచి నాకు లభించిన ఆశీస్సులవి. సంగీతకారులకే పథనిర్దేశం చేసిన సంగీత విద్వాంసులు పండిట్జీ. ఒక గంట పాటు మనం ఆయన మాటల్ని వింటే, సంగీతంలో తాకగల ఎత్తులు ఎన్నో ఉన్నాయని మన గ్రహింపునకు వస్తుంది. సృజనశీలురు తమ ఊహల నుండి సృష్టిస్తారు. కానీ మనం శర్మాజీ జ్ఞానం, శైలి నుంచి నేర్చుకున్న నైపుణ్యాలతోనైనా నవ రాగాలకు ఊపిరి పొయ్యొచ్చు. చాలామంది కళాకారుల మాదిరిగా పండిట్జీ నుంచి నేను కూడా రాగాలను ఎలా నియంత్రించాలి, లయలను ఎలా విభజించాలి, కూర్పులో ఎన్ని వైవిధ్యాలు తీసుకురావాలి, ఇవన్నీ చేస్తున్న ప్పుడు ప్రేక్షకుల ధ్యాసను ఎలా పట్టుకోవాలి; సంప్రదాయానికీ, ఆధునికతకూ ఎలా వంతెన వేయాలి అనే విషయాలను నేర్చు కున్నాను. కొత్తవాద్యంతో సంప్రదాయ ప్రేక్షకులను ఒప్పించి, మెప్పించడం చాలా కష్టమైన పని. కానీ పండిట్జీ గొప్ప శక్తితో, ఉత్సాహంతో ఆ పని చేయగలిగారు. నావంటి వారికి ఒక కొత్త ప్రయోగాన్ని చెయ్యడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చారు. విశ్వమోహన్ భట్ వ్యాసకర్త ప్రసిద్ధ వాద్య సంగీతకారులు,గ్రామీ అవార్డు గ్రహీత -
వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత
విశాఖ : ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు (76) కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం ఇవటూరి స్వర్గస్తులైనారు. ఇవటూరి విజయేశ్వరరావు 1938, మే 29న విశాఖలో జన్మించారు. చూపు లేకపోయినా, ఎందరికో సంగీత పాఠాలు నేర్పి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నంలో సంగీత విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇవటూరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2011లో ప్రతిభా రాజీవ్ పురస్కారంతో సన్మానించింది. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు స్వర్గీయ ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రియశిష్యుల్లో ఇవటూరి విజయేశ్వరరావు ఒకరు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.


