మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనలో ఓ బాలుడు తొలి కచేరీ ఇచ్చాడు. కేటాయించింది ముప్పై నిమిషాలే అయినా, శ్రోతలు కాలగమనాన్నే మరిచిపోయేలా ఆ కచేరీ మూడు గంటలపాటు సాగిందని చెబుతారు. ఆ గానం విన్న హరికథా విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ మూర్తి భాగవతార్, ఆ ‘మురళీకృష్ణ’ అన్న అతడి పేరుకు ‘బాల’ను జోడించారు. అప్పటి నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు.
1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి, మున్ముందు భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం పదిహేనేళ్ల వయసులో 72 మేళకర్త రాగాలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రతి రాగంలోనూ కృతులు రచించారు. ఆ కృతుల సంకలనమే ‘జనక రాగ కృతి మంజరి’. వర్ణాలు, కృతులు, థిల్లా నాలు, భావగీతాలతో కలిపి 400కు పైగా రచనలు చేసిన ఆయన, తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాష ల్లోనూ సమానమైన సౌందర్యంతో స్వరపరిచారు.
కొత్త రాగాలు–తాళాలు
‘సంప్రదాయం అంటే స్తబ్ధత కాదు, అది సజీవ ప్రవాహం’ అన్నదే బాలమురళి దృక్పథం. ప్రాచీన సంప్రదాయపు మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే ఆయన కొత్త సరిహద్దులను తాకారు. మహతి, లవంగి, గణపతి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, ఓంకారి వంటి సరికొత్త రాగాలను సృష్టించారు. వీటిలో కొన్ని కేవలం మూడు లేదా నాలుగు స్వరాలతోనే రూపొందినవి. అంతేకాదు, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి సరికొత్త తాళ పద్ధతులకు ఆయన ప్రాణం పోశారు.
మూడు అష్టకాల విస్తృతి, అపార గాంభీర్యం, స్ఫటికంలాంటి స్పష్టమైన ఉచ్చారణ, గమకాల్లో అసాధారణ నైపుణ్యం ఆయనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు ఇచ్చిన ఆయన, పండిట్ భీమ్‌సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిశోరీ అమోన్కర్ వంటి హిందు స్థానీ దిగ్గజాలతో జుగల్‌బందీలు నిర్వహించి, ఉత్తరాది–దక్షిణాది సంగీతాలకు వారధిగా నిలిచారు. గాత్రంతో పాటు వయోలిన్, వీణ, మృదంగం, కంజీరా, వయోలాలను అద్భుతంగా వాయించారు. ఆకాశవాణిలో ఏడు వేర్వేరు ప్రదర్శన విభాగాల్లో ‘టాప్ గ్రేడ్’’ సాధించిన ఏకైక సంగీతకారుడిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ని విదేశీ గాయక బృందంతో కలిసి ఆలపించడం, రవీంద్ర సంగీతాన్ని బెంగాలీలో రికార్డు చేయడం, జాజ్ ఫ్యూజన్ ప్రయో గాలు చేయడం, ఆయన సంగీత పరిధికి హద్దులే లేవని చాటిచెప్పాయి. వెండితెరపైనా బాలమురళి తనదైన ముద్ర వేశారు. 1967లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రలో నటిస్తూ, ‘ఆది అనాదియు నీవే దేవా’ వంటి అమర గీతాలు ఆలపించారు.
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ అందుకున్న అరుదైన కర్ణాటక సంగీత మహనీయుడు ఆయన. ఫ్రా¯Œ్స ప్రభుత్వపు ‘షెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ వంటివి ఎన్నో అందుకున్న ఆయన 2016 నవంబర్ 22న చెన్నైలో కన్ను మూశారు. కానీ ఆయన స్వరం, కృతులు, రాగాలు సజీవంగా మారుమోగుతూనే ఉన్నాయి. – డా కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి)


