బంధాలను తెంపేస్తున్న ‘ఆర్థిక ద్రోహం’
భాగస్వామికి తెలియని సీక్రెట్ ఖాతాలు!
ఉన్న అప్పుల గురించీ చెప్పని నిజాలు
పారదర్శకత అవసరం అంటున్న మనోవైజ్ఞానిక నిపుణులు
మనుషుల మధ్య సంబంధాలను డబ్బు ఎంత సులభంగా దూరం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమానురాగాలు, నమ్మకంతో మొదలయ్యే బంధాల్లో ఒక్కోసారి చిన్న చిన్న అబద్ధాలు కూడా తీవ్రమైన అగాధాన్ని సృష్టిస్తాయి. మనస్పర్థలకు, ఆఖరికి విడాకులకు కూడా కారణం అవుతాయి. ఇటువంటి డబ్బు దాపరికాలను మనోవైజ్ఞానిక నిపుణులు ‘ఆర్థికపరమైన నమ్మక ద్రోహం’ అంటున్నారు.
దాచిపెట్టడటమే ద్రోహం
భార్యాభర్తలు లేదా వ్యాపార భాగస్వాములు ఒక నిబద్ధత కలిగిన బంధంలో ఉంటూ కూడా, ఒకరికి తెలియకుండా ఒకరు ఆర్థిక లావాదేవీలను, అప్పులను లేదా డబ్బుకు సంబంధించిన కీలక సమాచారాన్ని దాచిపెట్టడమే ఆర్థిక ద్రోహం. డబ్బు అనేది చాలా సున్నితమైన అంశం. ఇద్దరి మధ్య ఆర్థిక విషయాల్లో పారదర్శకత లేకపోతే, అది పరస్పర నమ్మకాన్ని దెబ్బతీసి చివరికి బంధాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి వెళ్తుంది.
ఇవన్నీ ‘ద్రోహ’ చర్యలే
అప్పులను దాచడం: భాగస్వామికి తెలియకుండా రహస్యంగా లోన్లు తీసుకోవడం లేదా రుణాలను వేరే ఖాతాల్లో రహస్యంగా నిర్వహించటం.
పెద్ద ఖర్చులు, కొనుగోళ్లు: ఉమ్మడి భవిష్యత్తు గురించి చర్చించకుండానే ఇష్టానుసారం భారీగా ఖర్చులు చేయడం.
ఆదాయాన్ని గోప్యంగా ఉంచడం: సంపాదనకు సంబంధించిన సరైన వివరాలు చెప్పకపోవడం.
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను దాచడం: బిల్లులు, ఖర్చుల రసీదులు భాగస్వామి కంట పడకుండా ఈ మెయిళ్లకు పరిమితం చేయడం లేదా స్టేట్‌మెంట్‌లను మాయం చేయడం.
బంధాలపై ప్రభావం
ఈ రకమైన మోసం భాగస్వాముల మధ్య ఉన్న పునాది లాంటి నమ్మకాన్ని పూర్తిగా కూల్చేస్తుంది. సరైన సమయంలో స్పందించకపోతే ఇది విడాకులకు దారితీసే అవకాశం ఉంది. కొన్నిసార్లు విపరీతమైన ఖర్చులు చేసే అలవాటు కేవలం డబ్బు సమస్యే కాకుండా, లోతైన మానసిక లేదా వ్యక్తిగత సమస్యలకు సంకేతం కావచ్చు.
ఇదీ చదవండి: ఎయిర్‌హోస్టెస్ హత్య కేసులో ట్విస్ట్ : రూ. 13 లక్షల సుపారీ ఇచ్చి మరీ!
సమస్య పరిష్కారం ఎలా?
నిజాయితీగా ఒప్పుకోవడం: జరిగిన తప్పును దాచకుండా భాగస్వామికి చెప్పి, నిజం ఒప్పుకోవాలి. ఉమ్మడి బడ్జెట్ ఏర్పాటు: ఇద్దరూ కలిసి కూర్చుని ఒక స్పష్టమైన బడ్జెట్‌ను, ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి.
‘అలవెన్స్’ (స్వయంప్రతిపత్తి) పద్ధతి: చాలా జంటలు ఈ పద్ధతిని పాటిస్తారు. దీని ప్రకారం ప్రతి భాగస్వామి నెలకు ఒక నిర్ణీత మొత్తాన్ని మరొకరిని అడగకుండా తమ సొంత అవసరాలకు వాడుకోవచ్చు. దీనివల్ల ఉమ్మడి లక్ష్యాలు నెరవేరుతూనే, వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ కూడా దొరుకుతుంది.
నిపుణుల సహాయం (కౌన్సెలింగ్): సమస్య జటిలంగా మారితే రిలేషన్‌షిప్ లేదా ఫైనాన్షియల్ కౌన్సెలర్‌ను సంప్రదించడం మంచిది. ఒక బంధంలో ఆర్థిక ప్రశాంతత, అన్యోన్యత నిలవాలంటే పారదర్శకత, సంభాషణ చాలా కీలకం. భాగస్వామితో డబ్బు పట్ల మీ ఆలోచనలు, ఖర్చుల విధానం గురించి దాపరికం లేకుండా మాట్లాడటం భవిష్యత్తులో వచ్చే ఎన్నో గొడవలను నివారిస్తుంది. పరస్పర సహకారంతో ఏ ఆర్థిక సమస్యనైనా అధిగమించవచ్చు, కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టు కోవచ్చు!
గుర్తించే సంకేతాలు ఏమిటి?
నేటి ఆన్‌లైన్ యుగంలో క్రెడిట్ కార్డ్‌లు, ఈ–స్టేట్‌మెంట్‌ల పుణ్యమా అని అప్పులను, ఖర్చులను దాచడం కొందరికి చాలా సులభమైపోయింది. అయితే కింద పేర్కొన్న సంకేతాల ద్వారా ‘ఆర్థిక ద్రోహాన్ని’ గుర్తించవచ్చు (రోజుకొక కప్పు చాయ్: గుండె జబ్బులకు బై–బై)
డబ్బు ప్రస్తావన తెస్తే కోపం: డబ్బు గురించిన చర్చ రాగానే ఎదురుదాడి చేయడం లేదా ఉద్దేశ పూర్వకంగా మౌనంగా ఉండటం.
అకారణంగా నగదు ఉపసంహరణ: ఉమ్మడి ఖాతాల నుండి సరైన కారణం చెప్పకుండా తరచూ పెద్ద మొత్తంలో క్యాష్ విత్‌డ్రా చేయడం.
రహస్య ఖర్చులు: భాగస్వామికి తెలియకుండా ఖరీదైన బహుమతులు, ప్రయాణాలు లేదా జూదం (క్యాసినోలు) వంటి వాటికి డబ్బు తగలేయడం.
ఖాతాలపై యాక్సెస్ తొలగింపు: ఉమ్మడి ఖాతాల నుండి భాగస్వామికి ఉన్న హక్కులను లేదా యాక్సెస్‌ను రహస్యంగా తొలగించడం.
– సాక్షి స్పెషల్ డెస్క్


