రోజుకొక కప్పు చాయ్‌: గుండె జబ్బులకు బై–బై | A Cup Tea in a day check benefits for heart health | Sakshi
Sakshi News home page

రోజుకొక కప్పు చాయ్‌: గుండె జబ్బులకు బై–బై

Nov 20 2026 5:17 PM | Updated on Nov 20 2026 5:17 PM

A Cup Tea in a day check benefits for heart health

రోజూ టీ తాగడం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ప్రమాదం 11 శాతం వరకు తగ్గుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం టీ తాగడం వల్ల మాత్రమే గుండెపోటులను పూర్తిగా నివారించలేమని, ఇది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం మాత్రమేనని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

అధ్యయనంలోని కీలకాంశాలు   
చైనాకు చెందిన దాదాపు 4,85,934 మంది వయోజనులపై సుమారు తొమ్మిదేళ్ల పాటు జరిగిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన కాలంలో వేలాది మంది గుండె జబ్బులు, పక్షవాతం, పల్మనరీ హార్ట్‌ డిసీజ్, పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ వంటి సమస్యల బారిన పడ్డారు. వీరిలో క్రమం తప్పకుండా టీ తాగే అలవాటు ఉన్నవారిలో గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వచ్చే ప్రమాదం సుమారు 11 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రతిష్టాత్మక ‘జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైన అధ్యయన నివేదిక వెల్లడించింది.  

టీ తయారీ – రకాల ప్రాధాన్యత 
గ్రీన్‌ టీతో పోలిస్తే బ్లాక్‌ టీ తాగడం వల్ల రక్తనాళాల జబ్బుల ప్రమాదం మరింత స్థిరంగా, ఎక్కువగా తగ్గినట్లు కూడా ఈ అధ్యయనంతో తేలింది. ఈ రెండు రకాల టీలు ‘కెమెల్లియా సినెన్సిస్‌’ అనే ఒకే మొక్క నుంచి వస్తాయి. కానీ వీటి తయారీ విధానంలో తేడా ఉంటుంది. బ్లాక్‌ టీ ఆకులను ‘ఆక్సిడేషన్‌’కు గురిచేస్తారు, దీనివల్ల వాటి రసాయన కూర్పు మారుతుంది. గ్రీన్‌ టీ ఆకులను ఆక్సిడేషన్‌ అవ్వకుండా ప్రాసెస్‌ చేస్తారు. ఈ ప్రాసెసింగ్‌ తేడాల వల్లే రెండింటిలో ఉండే పాలిఫెనాల్స్‌ రకాలు, వాటి పరిమాణాలు మారుతాయి. అలాగే టీని ఎంత చిక్కగా కాచుకుంటామనేది కూడా చాలా ముఖ్యమే. మరీ ఎక్కువ డికాషన్‌ లేకుండా, చక్కెర లేదా పాలు లేకుండా తీసుకునే బ్లాక్‌ గ్రీన్‌ టీలలో మితమైన చిక్కదనంతో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి టీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. 

ఎంత మోతాదులో తాగాలి? 
పరిశోధనల ప్రకారం రోజుకు 6 నుండి 8 కప్పుల టీ తాగే వారిలో అత్యంత తక్కువ గుండె జబ్బుల ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. అయితే దీనిని ఎప్పుడూ ఒక కచ్చితమైన సిఫార్సుగా తీసుకోకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు ఉపయోగించిన కప్పుల సైజులు ప్రామాణికంగా లేవు. మరోవైపు, ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల అందులోని కెఫిన్‌ కారణంగా నిద్రలేమి, గుండె దడ లేదా కంగారు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కెఫిన్‌ పడని వారు ఈ విషయాన్ని కచి్చతంగా గమనించుకోవాలి. ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారు మితంగా తీసుకోవడమే ఆరోగ్యకరం. 

గుండె ఆరోగ్యానికి టీ ఎలా తోడ్పడుతుంది?  
టీలో పాలిఫెనాల్స్‌ అనబడే సహజ వక్ష సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు అత్యంత కీలకమైనవి. ఈ సమ్మేళనాలకు యాంటీఆక్సిడెంట్, యాంటీ–ఇన్‌ప్లమేటరీ గుణాలు ఉండి, రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడంలో రక్తనాళాల లోపలి పొర కీలకపాత్ర పోషిస్తుంది. టీలోని సహజ సమ్మేళనాలు ఈ పొర సాధారణంగా పనిచేసేలా సహాయపడతాయి. దీర్ఘకాలికంగా శరీరంలో వాపు ఉండటం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. పాలిఫెనాల్స్‌ శరీరంలో జరిగే ఇటువంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రక్రియలను నియంత్రించడంలో తోడ్పడతాయి. అంతేకాకుండా, చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్‌కు బదులుగా చక్కెర లేని టీ తాగడం వల్ల శరీరంలోకి అదనపు చక్కెర చేరదు. ఇది బరువు నియంత్రణకు, మెటబాలిక్‌ (జీవక్రియ) ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తుంది.                                            

 
– సాక్షి స్పెషల్‌ డెస్క్‌ 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement