మధ్యప్రదేశ్‌కు చెందిన ఎయిర్‌లైన్ ఉద్యోగిని, 35 ఏళ్ల వర్ష తుర్కర్ పుణె హత్యకు సంబంధించి పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే రూ. 13 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో వర్షను హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి , మహారాష్ట్రలోని గోండియా జిల్లాకుచెందిన మహిళతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పుణె విమానాశ్రయంలో ఎయిరిండియాలో పనిచేస్తున్న వర్ష నవంబర్ 14న అనుమానాస స్పద స్థితిలో కన్నుమూసింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమెను కత్తులతో పొడిచి హత్య చేశారు. అటవీ ప్రాంతంలో జరిగిన దోపిడీ యత్నంగా పోలీసులు మొదట భావించినప్పటికీ, దర్యాప్తులో ఇది రూ. 13 లక్షల సుపారీ హత్య అని తేలింది.
పోలీసుల కథనం ప్రకారం 41 ఏళ్ల మోనా అగర్వాల్ తన భర్త నితేష్ అగర్వాల్‌కు మృతురాలు వర్షతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించింది. ఈ అనుమానంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం మోనా తన పొరుగింటి వ్యక్తి కునాల్ శ్యామ్‌లాల్ కుంభల్కర్ (31) ను ఆశ్రయించింది. చివరకు వర్షను హత్య చేసేందుకు రూ. 13 లక్షలకు ఒప్పందం కుదిరింది. కునాల్, షారుఖ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ పఠాన్, మరో ఇద్దరితో కలిసి ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యాడు.
హత్యకు పథకరచన ఇలా..
నవంబర్ 14న వర్ష, తనకు కొన్నేళ్లుగా పరిచయమున్న నితేష్‌తో కలిసి గోండియాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరోడాకు వెళ్లింది. అక్కడినుంచి వారు సాయంత్రం తిరిగి వస్తుండగా బొంద్రాని అటవీ ప్రాంతంలోని ఒక శివాలయం సమీపంలో కారు ఆపారు. అప్పటికే వారిపై నిఘా పెట్టిన ముగ్గరు హంతకులు అదే అదనుగా వర్షపై కత్తులతో విరుచుకు పడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమెను వెంటనే సరిహద్దులోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గుర్తుతెలియని దొంగలు తమపై దాడి చేశారని నితేష్ మొదట పోలీసులకు చెప్పాడు. అయితే, వర్ష మెడలోని బంగారు గొలుసు, ఇతర నగలు అలాగే ఉండటంతో దోపిడీ కోణంపై పోలీసులకు అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు చేయగా ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య అని స్పష్టమైంది.
జీపీఎస్ ట్రాకర్‌తో నిఘా
నితేష్ నడుపుతున్న కారు అతని భార్య మోనా పేరు మీద రిజిస్టర్ అయి ఉందని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. కారుకు సంబంధించిన 'టయోటా ఐ-కనెక్ట్' (Toyota i-Connect) జీపీఎస్ అప్లికేషన్ లాగిన్ వివరాలను మోనా దుండగుల ఫోన్లలో యాక్టివేట్ చేసింది. దీని ద్వారా వారు కారు లైవ్ లొకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, పథకం ప్రకారం అక్కడికి చేరుకుని వర్షపై దాడి చేసి హతమార్చారు.
ఇదీ చదవండి: డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్ నుంచి ‘తార’ గా ఎవరీ భామ?
200 సీసీటీవీ కెమెరాల పరిశీలన
ఘటనా స్థలం నుండి తిరోడా, ఖైర్లాంజి, వారసెయోని, బాలాఘాట్ మరియు గోండియా మార్గాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని గోండియా పోలీసులు పరిశీలించడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు నితేష్ కారును వెంబడించినట్లు ఫుటేజీలో స్పష్టమైంది. ఈ క్రమంలో నవంబర్ 19న గోండియాలో ఇమ్రాన్ కరీం షేక్ (26) అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, కుట్ర వివరాలన్నీ బయటపడ్డాయి.
ఇదీ చదవండి: బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్
ఇప్పటివరకు మోనా అగర్వాల్, కునాల్ కుంభల్కర్, షారుఖ్ పఠాన్, ఇమ్రాన్ షేక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నలేన్ అలియాస్ నైలా షేక్ (24), క్రిష్ రౌత్ (19) అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ. 50 లక్షల జీతం వదిలి.. ఐఐఎం బెంగళూరు నుంచి సాధ్విగా, తోడుగా తల్లి


