లిఫ్టులో 12 ఏళ్లలోపు పిల్లలు ఒంటరిగా వెళ్లరాదు | Maharashtra Lift Rules: Why children under 12 can no longer ride alone | Sakshi
Sakshi News home page

లిఫ్టులో 12 ఏళ్లలోపు పిల్లలు ఒంటరిగా వెళ్లరాదు

Nov 19 2026 5:58 PM | Updated on Nov 19 2026 6:04 PM

వెంట తల్లిదండ్రులు లేదా పెద్దలు తప్పనిసరి..  

లిఫ్టులు, ఎస్కలేటర్ల భద్రతపై మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు

దాదర్‌: ముంబై సహా మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో లిఫ్టు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లలోపు పిల్లలను లిఫ్టులు, ఎస్కలేటర్లలో ఒంటరిగా పంపించరాదని స్పష్టం చేసింది. పిల్లల వెంట తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు ‘మహారాష్ట్ర లిఫ్టు, ఎస్కలేటర్, మూవింగ్‌ వాక్‌–2026’ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యుత్‌ శాఖ ఇటీవల ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది.

ముంబై, థానే పరిసర ప్రాంతాల్లో భారీ నివాస టవర్లు, 40 నుంచి 45 అంతస్తుల భవనాలు, షాపింగ్‌ మాల్స్, వాణిజ్య సముదాయాలు భారీగా పెరిగాయి. వీటిలో లిఫ్టుల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. అయితే కొన్ని నివాస సొసైటీలు, టవర్లలో తరచూ లిఫ్టు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు పిల్లలు లిఫ్టుల్లో ఆటలు ఆడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. లిఫ్టు డోర్లు తెరుచుకోకపోవడం, డోర్లు తెరిచి ఉండగానే లిఫ్టు కదలడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కొన్ని ప్రమాదాల్లో ప్రాణనష్టం, గాయాలు సంభవిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ద్వారా ప్రమాదాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. లిఫ్టు కంపెనీల ప్రతినిధుల తనిఖీలతో ప్రమాదాలకు గల కారణాలను గుర్తించే అవకాశం కలుగుతోంది. ఈ నేపథ్యంలో నివాస సొసైటీలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ నిర్వాహకులపై ప్రభుత్వం అదనపు బాధ్యతలు విధించింది. 12 ఏళ్లలోపు పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే లిఫ్టులు, ఎస్కలేటర్లు వినియోగించేలా చూడాలని ఆదేశించింది.

ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు 
లిఫ్టులు, ఎస్కలేటర్ల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పలు కీలక నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.  
నెలవారీ నిర్వహణ: ప్రతి నివాస సొసైటీ, వాణిజ్య, వ్యాపార సంస్థ తప్పనిసరిగా లైసెన్స్‌ కలిగిన అ«దీకృత కాంట్రాక్టర్‌ ద్వారా నెలకు ఒకసారి లిఫ్టుల నిర్వహణ పనులు చేయించాలి.

రికార్డుల భద్రత: నిర్వహణ, తనిఖీల అనంతరం జారీ చేసిన ధ్రువపత్రాలు, సంబంధిత రికార్డులను భవనాల నిర్వాహకులు భద్రపర్చుకోవాలి.

ఏటా భద్రతా తనిఖీలు: ప్రతి సంవత్సరం సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించి, సంబంధిత ధ్రువపత్రాలను విద్యుత్‌ శాఖ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించాలి.

ఇదీ చ‌ద‌వండి: మనిషి కలలకు బలైన మూగజీవి

థర్డ్‌ పార్టీ బీమా: ప్రతి లిఫ్టుకు తప్పనిసరిగా థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సీసీటీవీ ఏర్పాటు: లిఫ్టుల వద్ద సీసీటీవీ కెమెరాలు, ఇతర భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.

2027, అక్టోబరు 28 వరకు గడువు 
రాష్ట్రంలోని నివాస టవర్లు, హౌసింగ్‌ సొసైటీలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు సహా ఇతర భద్రతాపరమైన చర్యలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం 2027, అక్టోబరు 28 వరకు గడువు ఇచ్చింది. అప్పటిలోగా అవసరమైన భద్రతా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లిఫ్టు ప్రమాదాలను అరికట్టడం, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, భవనాల నిర్వాహకుల్లో బాధ్యత పెంచడం ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement