నక్షత్ర లోకానికి.. తిరిగిరాని పయనం
అంతరిక్ష చరిత్రలో కన్నీటి ‘చుక్క’
మూగ జీవుల హక్కులకు... ఊపిరి పోసిన లైకా మరణం
విశ్వాంతరాళాన్ని అందుకోవడానికి మనిషి వేసిన తొలి అడుగుల వెనుక ఒక మూగజీవి నిశ్శబ్ద త్యాగం దాగి ఉందని ఎంతమందికి తెలుసు? 1957లో ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ప్రపంచం రెండుగా విడిపోయి, పరస్పరం అపనమ్మకంతో ఉన్నప్పటికీ, ఒక చిన్న శునకం యావత్ ప్రపంచాన్ని భావోద్వేగంతో ఏకం చేసింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి జీవిగా చరిత్రకెక్కిన ‘లైకా’విషాద గాథ, ఆ తర్వాత జంతు హక్కుల ఉద్యమంలో ఒక గొప్ప ప్రతీకగా మారింది.
ప్రపంచం ఆరాధించిన క్షణం
1957 నవంబర్ 3న సోవియట్ యూనియన్ (రష్యా) ‘స్పుత్నిక్ 2’ఉపగ్రహంలో ‘లైకా’ అనే మూడేళ్ల కుక్కను అంతరిక్షంలోకి పంపింది. ఈ వార్త వినగానే ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అందరూ లైకాను ఎంతో ఆరాధించారు. ఆ చిన్నారి శునకం తన అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా తిరిగి భూమిపైకి వస్తుందని అప్పట్లో అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ, లైకాను సజీవంగా వెనక్కి తీసుకురావాలనే ప్రణాళిక అసలు లేదనే చేదు నిజం అప్పట్లో ప్రపంచానికి తెలియదు!
అప్పటికప్పుడు హడావిడిగా..!
అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా కంటే ముందుండాలనే తపన సోవియట్ యూనియన్‌లో బలంగా ఉండేది. మొదటి ఉపగ్రహం ‘స్పుత్నిక్ 1’విజయంతో ఉత్సాహంగా ఉన్న అప్పటి సోవియట్ ప్రధాని నికితా కృశ్చేవ్, తన దేశ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటుకోవడానికి కేవలం కొన్ని వారాల్లోనే ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలని ఆదేశించారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో, మాస్కో వీధుల్లో తిరిగే ‘లైకా’అనే వీధి కుక్కను ఈ ప్రయోగానికి ఎంపిక చేశారు. అత్యంత ఇరుకైన క్యాప్సూల్‌లో ఉండేలా దానికి కఠిన శిక్షణ ఇచ్చారు. అయితే, అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌకను తిరిగి సురక్షితంగా భూమిపైకి దించే టెక్నాలజీని రూపొందించడానికి శాస్త్రవేత్తలకు సమయం సరిపోలేదు. అంటే, లైకాది తిరిగిరాని ప్రయాణమని ముందే నిర్ణయమైపోయింది!
దాచి ఉంచిన చేదు నిజాలు
ప్రయోగం జరిగిన తర్వాత, లైకా 7 నుండి 10 రోజుల పాటు జీవించేలా తగినంత ఆహారం, ఆక్సిజన్ ఏర్పాటు చేశామని, అది అంతరిక్షంలో క్షేమంగా ఉందని సోవియట్ అధికారులు వారం రోజుల పాటు ప్రపంచాన్ని నమ్మించారు. ఆ తర్వాత, ఆక్సిజన్ అయిపోయే ముందు దానికి ఎటువంటి నొప్పి కలగకుండా ఆహారంలో విషం కలిపి ప్రశాంతంగా కన్నుమూసేలా చేశామని ప్రకటించారు. లైకా మరణం వెనుక ఉన్న అసలు నిజం 1991లో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాతే ప్రపంచానికి తెలిసింది.
ప్రయోగంలో అసలేం జరిగింది?
రాకెట్ నింగిలోకి ఎగిరినప్పుడే విపరీతమైన శబ్దం, ప్రకంపనల వల్ల లైకా భయంతో వణికిపోయింది. దాని గుండె వేగం సాధారణం కంటే మూడు రెట్లు పెరిగిపోయింది.
వ్యోమనౌక భూకక్ష్యలోకి చేరగానే, క్యాప్సూల్‌లోని ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింది.
క్యాప్సూల్ లోపల వేడి విపరీతంగా పెరిగిపో యి, ఉష్ణోగ్రత 100డిగ్రీల సెల్సియస్ దాటింది.
ఫలితంగా, ప్రయోగం జరిగిన 5 నుండి 7 గంటలలోపే లైకా ఆ భయంకరమైన వేడికి, ఒత్తిడికి తట్టుకోలేక విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది.
జంతు హక్కుల ఉద్యమానికి స్ఫూర్తి
ఒక అమాయకపు జీవిని ఉద్దేశపూర్వకంగా చంపే ప్రయోగం చేశారంటూ అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అంతరిక్ష పరిశోధనల్లో నైతిక విలువలపై పెద్ద చర్చకు దారితీసింది. దాంతో, ఆ తర్వాత సోవియట్ యూనియన్ కుక్కలు, కోతులను అంతరిక్షంలోకి పంపినప్పటికీ, వాటన్నింటినీ సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురావడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మానవ అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేసిన లైకా, నేటికీ జంతువులపై జరిగే ప్రయోగాలకు వ్యతిరేకంగా పోరాడే జంతు హక్కుల కార్యకర్తలకు ఒక గొప్ప స్ఫూర్తిదాయక చిహ్నంగా, శాశ్వత జ్ఞాపకంగా నిలిచిపోయింది.
– సాక్షి స్పెషల్ డెస్క్


