షేక్ హసీనాను తమకు అప్పగించే విషయంలో భారత్ ఎలాంటి షరతులు విధించలేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ఈ అంశంపై భారత్‌తో ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే అమల్లో ఉన్న ద్వైపాక్షిక నేరస్తుల అప్పగింత ఒప్పందం (ఎక్స్‌ట్రడిషన్ ట్రీటీ) ప్రకారమే హసీనాను తమకు అప్పగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.
2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు రాగా.. అప్పటి నుంచి ఆమెను తిరిగి తీసుకెళ్లేందుకు ఢాకా ప్రయత్నాలు చేస్తోంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో కీలకంగా మారింది. విదేశాంగ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం.. హసీనా అప్పగింతకు సంబంధించి భారత్ ఎలాంటి హామీలు కోరలేదని స్పష్టం చేశారు.
భారత్ రెండు షరతులు అంటూ బీబీసీ బంగ్లా కథనంపై స్పందించిన షామా ఒబైద్.. భారత్‌తో ఈ అంశాలపై ఎలాంటి చర్చలు జరగలేదని తేల్చిచెప్పారు. హసీనా బంగ్లాదేశ్ ఆర్మీ విమానంలో భారత్‌కు వెళ్లినందున.. తిరిగి ఆమెను తీసుకురావాల్సిన బాధ్యత కూడా బంగ్లాదేశ్ సైన్యానిదేనని భారత్ భావిస్తున్నట్లు బీబీసీ కథనం.. మరో వైపు, హసీనాకు మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని, 2024 జులై ఉద్యమ సమయంలో జరిగిన మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల ఆరోపణలపై విచారణను కొత్తగా నిర్వహించాలని భారత్ కోరుతున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.
అయితే ఈ ప్రచారాన్ని షామా ఒబైద్ ఖండించారు. అసలు అలాంటిదేమీ లేదని.. ఈ విషయంలో భారత్‌తో మాకు ఎలాంటి చర్చలు జరగలేదని ఆమె స్పష్టం చేసినట్లు ప్రోథోమ్ అలో పత్రిక వెల్లడించింది. హసీనాను అప్పగించాలని భారత్‌కు పలుమార్లు లేఖలు రాశామని.. ఇరు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారమే ఈ ప్రక్రియ ముందుకు సాగుతుందని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు. విదేశాల్లో ఉంటున్న దోషిగా నిర్ధారణ అయిన ఖైదీగా హసీనాను పేర్కొన్న ఆమె.. తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన న్యాయపరమైన మార్గాలపై న్యాయశాఖ పరిశీలన చేస్తోందన్నారు.
‘‘ఆమెను ఎలా తీసుకురావాలన్న అంశాన్ని న్యాయశాఖ పరిశీలిస్తోంది. ఇతర నిందితుల విషయంలో అనుసరించినట్లుగానే అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమె తిరిగి వస్తారని, ఇక్కడే శిక్ష అనుభవిస్తారని భావిస్తున్నాం. భారత్ స్పందిస్తే బంగ్లాదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రక్రియ మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం పరిష్కారం కావడంలో భారత్ రాజకీయ సానుకూలత కూడా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
మరో వైపు, హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్ తరఫున పూర్తి చేయాల్సిన అన్ని అధికారిక ప్రక్రియలను ముగించినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి ఎండీ అసదుజ్జమాన్ ఇటీవల వెల్లడించారు. న్యాయపరమైన ప్రక్రియలో మా వైపు నుంచి పూర్తి చేయాల్సిన అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక భారత్ ఏం చేయాలన్నది ఆ దేశ నిర్ణయం అంటూ ఆయన పేర్కొన్నారు. మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల కేసుల్లో అప్పీల్ దాఖలు గడువును పొడిగించే అధికారం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకు లేదని కూడా ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: బతికుంటానో లేదో తెలియదు!


