బతికుంటానో లేదో తెలియదు! | Pakistan Ex Pm Imran Khan Appeals For Urgent Medical Help | Sakshi
Sakshi News home page

బతికుంటానో లేదో తెలియదు!

Nov 17 2026 6:58 AM | Updated on Nov 17 2026 7:03 AM

Pakistan Ex Pm Imran Khan Appeals For Urgent Medical Help

ఆపదలో ఉన్నా.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదో తెలియడం లేదంటూ జైల్లో ఉన్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఎప్పుడైనా బ్రెయిన్‌ హెమరేజ్‌, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారని ఆయన వెల్లడించారు. తన భార్య బుష్రా బీబీ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టుకు ఆయన అత్యవసర లేఖ రాశారు.

చికిత్స అందించాలంటూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని ఇమ్రాన్‌ ఆరోపించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపారు. తన భార్య బుష్రా బీబీ కూడా జైలులోనే ఉన్నారని, ఆమెకు సరైన వైద్యం అందకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులే సుప్రీంకోర్టుకు లేఖ రాయడానికి కారణమని తెలిపారు.

74 ఏళ్ల వయసులో ఈ పరిస్థితులు నన్ను తిరిగి ప్రాణాలతో రాలేని స్థితికి తీసుకెళ్తున్నాయి. నేను బతికి బయటపడతానో లేదో తెలియదంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చాలాకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉంచడం తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు అనుమతించాలని వైద్య బోర్డు సిఫారసు చేసినప్పటికీ అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే, గత వారం ఇమ్రాన్‌ ఖాన్‌ను కంటి పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి జైలు గదికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ ఆయన చేసిన విజ్ఞప్తిపై గత ఆగస్టులో పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు స్పందించింది. రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రికెటర్‌గా ప్రస్థానం ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఇమ్రాన్‌ ఖాన్‌.. 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయారు. అనంతరం ఆయనపై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement