నేడు పాకిస్తాన్‌తో ‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్
రాత్రి గం. 7:30 నుంచి VETO యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఢాకా: ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగినా... తమ జోరు కొనసాగిస్తూ పదోసారి దక్షిణాసియా చాంపియన్‌గా నిలవాలని భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు పట్టుదలతో ఉంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో భాగంగా ఢాకాలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. 33 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భారత జట్టు 14వసారి ఫైనల్ ఆడనుంది.
తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) విజేతగా... నాలుగుసార్లు రన్నరప్‌గా (1995, 2008, 2013, 2018) నిలిచిన భారత్ 2003లో మాత్రమే ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ తొలి మ్యాచ్‌లో 3–2 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌పై, రెండో మ్యాచ్‌లో 1–0 గోల్ తేడాతో మాల్దీవులుపై గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
సెమీఫైనల్లో చింగ్లేన్‌సనా సింగ్ సారథ్యంలోని భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో భూటాన్ జట్టును ఓడించి తుదిపోరుకు అర్హత పొందింది. అబ్దుల్లా ఇక్బాల్ కెపె్టన్సీలో పాకిస్తాన్ లీగ్ దశలో భారత్ చేతిలో ఓడిపోయి, రెండో మ్యాచ్‌లో 3–0 గోల్స్ తేడాతో మాల్దీవులు జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో పాకిస్తాన్ 1–0 గోల్ తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు 30 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 4 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలిచింది. 9 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.


