ఆండ్రీవా అదరహో | Russian tennis player Mirra Andreeva has won the WTA Finals | Sakshi
Sakshi News home page

ఆండ్రీవా అదరహో

Nov 17 2026 6:16 AM | Updated on Nov 17 2026 6:16 AM

Russian tennis player Mirra Andreeva has won the WTA Finals

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్‌ గెలిచిన రష్యా టీనేజ్‌ స్టార్‌

ఫైనల్లో మాజీ విజేత స్వితోలినాపై విజయం

రూ. 31 కోట్ల 65 లక్షల ప్రైజ్‌మనీ సొంతం  

ఇండియన్‌ వెల్స్‌: మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో రష్యా టీనేజ్‌ స్టార్‌ మిరా ఆండ్రీవా విజేతగా అవతరించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నిలో ఫైనల్‌కు చేరిన తొలి ప్రయత్నంలోనే 19 ఏళ్ల ఆండ్రీవా టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండ్రీవా 7–5, 6–3తో 2018 చాంపియన్, 2019 రన్నరప్, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. 

1 గంట 48 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ఆండ్రీవా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో... సెమీఫైనల్లో... ఫైనల్లో గెలిచి ఈ టోర్నీని ఆండ్రీవా అజేయంగా ముగించింది. తద్వారా 33 లక్షల 70 వేల డాలర్ల (రూ. 31 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. 

1500 ర్యాంకింగ్‌ పాయింట్లు కూడా పొందిన ఆండ్రీవా తాజా ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. అమెరికా దిగ్గజం బిల్లీ జీన్‌ కింగ్‌ చేతులమీదుగా విన్నర్స్‌ ట్రోఫీ అందుకున్న ఆండ్రీవాకు మెర్సిడెస్‌ బెంజ్‌ ఏఎంజీ ఎస్‌ఎల్‌ 55 4మాటిక్‌ (ధర రూ. 2 కోట్ల 34 లక్షలు) మోడల్‌ కారు కూడా బహుమతిగా లభించింది. రన్నరప్‌ స్వితోలినాకు 15 లక్షల డాలర్లు (రూ. 14 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కింది. డబుల్స్‌ టైటిల్‌ను టేలర్‌ టౌన్‌సెండ్‌ (అమెరికా)– కాటరీనా సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ సాధించింది.

→ షరపోవా (2004లో) తర్వాత డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ గెలిచిన రెండో రష్యా క్రీడాకారిణిగా ఆండ్రీవా గుర్తింపు పొందింది.

→ ఈ ఏడాది ఆండ్రీవా సాధించిన టైటిల్స్‌ (అడిలైడ్‌ ఓపెన్, లింజ్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్‌). ఈ ఏడాది మొత్తం 56 మ్యాచ్‌ల్లో గెలిచిన ఆండ్రీవా 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

→ ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ సాధించిన 11వ ప్లేయర్‌గా ఆండ్రీవా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement