వంతా (ఫిన్‌లాండ్): బీడబ్ల్యూఎఫ్ సూపర్ –500 టోర్నీ ఆర్క్‌టిక్ ఓపెన్‌లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు 21–8, 21–11 స్కోరుతో వెన్ యు జాంగ్ (కెనడా)పై ఘన విజయం సాధించింది. అయితే మరో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నతి హుడా, అస్మిత చాలిహా పోరాడి ఓడారు. తొలి రౌండ్‌లో ఉన్నతి 16–21, 21–15, 22–24 స్కోరుతో హాన్ కియాన్ గ్జి (చైనా) చేతిలో, అస్మిత 7–21, 21–14, 24–26 స్కోరుతో ఏడో సీడ్ లైనా క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయంపాలై నిష్క్రమించారు.
పురుషుల సింగిల్స్‌లో తరుణ్ మానేపల్లి, రౌనక్ చౌహాన్ క్వాలిఫయింగ్ దశను దాటి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో తరుణ్ 21–12, 19–21, 13–21తో జూలియన్ కరాగీ (బెల్జియం)పై, చౌహాన్ 18–21, 21–17, 21–19తో డానిల్ డుబువెంకో (ఇజ్రాయెల్)పై విజయం సాధించి ముందంజ వేశారు. మెయిన్ డ్రా తొలి రౌండ్‌లో జొనాసెన్ (డెన్మార్క్)తో తరుణ్... వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో చౌహాన్ తలపడతారు.


