ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాద సంస్థకు నాయకునిగా నియమితుడయ్యాడు. అతనే రెహమాన్ గుల్. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) కొత్త కమాండర్ ఇన్ చీఫ్‌గా అతడిని నియమించినట్లు సంస్థ ప్రకటించింది. మురీద్ అనే పేరుతో వ్యవహరించే గుల్ గతంలో ఈ సంస్థకు చెందిన మజీద్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. ఈ విభాగం ఆత్మాహుతి దాడులకు పాల్పడే విభాగంగా గుర్తింపు పొందింది.
1984 ఆగస్టులో బలూచిస్థాన్‌లోని నుష్కీలో ప్రముఖ మెంగల్ కుటుంబంలో జన్మించిన గుల్ 2002లో పాకిస్థాన్ సైన్యంలో చేరాడు. సుమారు ఎనిమిదేళ్లపాటు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశాడు. వజీరిస్థాన్‌లో పాకిస్థాన్ తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన సైనిక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2010లో సైన్యాన్ని వీడి అదే ఏడాది బీఎల్‌ఏలో చేరాడు.
అమెరికాకు చెందిన జేమ్స్‌టౌన్ ఫౌండేషన్ 2025లో ప్రచురించిన ప్రొఫైల్ ప్రకారం.. పాక్ ఆర్మీలో గుల్ ఉన్న సమయంలో బలూచ్ ప్రజలపై అణచివేత చర్యలు కొనసాగుతున్నట్లు అతను భావించాడు. అవి అతనిపై ప్రభావం చూపినట్లు తెలుస్తున్నది. గుల్ కుటుంబానికి రాజకీయ, సైనిక నేపథ్యం కూడా ఉంది. అతడి తల్లి వైపు బంధువుల్లో 1970వ దశకంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన లవాంగ్ ఖాన్ మెంగల్, కవి, రాజకీయ నాయకుడు గుల్ ఖాన్ నసీర్ ఉన్నారు. అతడి సోదరుడు సరబ్ ఖాన్ బలూచ్ పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది.
ఖరాన్, కలాత్ ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన గుల్.. అనంతరం మజీద్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. నవంబర్ 3న బషీర్ జెబ్ వైదొలిగినట్లు ప్రకటించిన బీఎల్‌ఏ తాజాగా రెహమాన్ గుల్‌ను తమ కొత్త అధిపతిగా నియమించింది. సంస్థ సీనియర్ కమాండ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ వెల్లడించాడు.
ఇదీ చదవండి: 20 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?


