జేబులో చిల్లిగవ్వ లేదు.. టాప్‌-6లో ఉంటామంటూ పాక్‌ ప్రకటన! | Shehbaz Sharif Goldman Sachs forecast Pak economy can be 6th by 2050 | Sakshi
Sakshi News home page

జేబులో చిల్లిగవ్వ లేదు.. టాప్‌-6లో ఉంటామంటూ పాక్‌ ప్రకటన!

Nov 15 2026 7:23 AM | Updated on Nov 15 2026 7:27 AM

Shehbaz Sharif Goldman Sachs forecast Pak economy can be 6th by 2050

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం.. భారీ అప్పులు.. ఐఎంఎఫ్‌ నిధుల కోసం ఎదురుచూపులు.. ఇవన్నీ ఒకవైపు ఉంటే.. మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఏకంగా 2050 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరిగిన పాకిస్థాన్‌ మినరల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌లో పాల్గొన్న షరీఫ్‌.. 2022లో గోల్డ్‌మన్‌ సాక్స్‌ విడుదల చేసిన ఆర్థిక అంచనాలను ప్రస్తావించారు. ఆ నివేదిక ప్రకారం 2075 నాటికి పాకిస్థాన్‌ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేశారు. అయితే ఆ గడువును తాను సవరించుకుంటున్నానని.. 2050 కంటే ముందే ఆ స్థాయికి చేరుకుంటామని షరీఫ్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఖనిజ సంపదపైనే ఆశలు
పాకిస్థాన్‌ ఆర్థిక ప్రగతికి ఖనిజ సంపదను ప్రధాన చోదకశక్తిగా మార్చుకోవాలని షరీఫ్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా రాగి, బంగారం నిల్వలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా లభించే ఖనిజాలను ముడిసరుకుగా ఎగుమతి చేయకుండా.. దేశంలోనే శుద్ధి చేసి, వాటితో కేబుల్స్‌, విద్యుత్‌ పరికరాల తయారీ వంటి పరిశ్రమలను అభివృద్ధి చేయాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌లోనే తవ్వకాలు, ప్రాసెసింగ్‌, తయారీ చేపట్టి.. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలన్నది తమ లక్ష్యమని వెల్లడించారు.

బలూచిస్థాన్‌లోని రెకో డిక్‌ (Reko Diq) రాగి, బంగారు నిక్షేపాలపై పాక్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందని రాగి, బంగారు నిక్షేపాల్లో ఇది ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టులో 2028 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని షరీఫ్‌ ప్రకటించారు. అయితే భద్రతాపరమైన సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు పనులు జరగడం లేదని, అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం, ఖర్చు అయ్యే అవకాశం ఉందని మైనింగ్‌ సంస్థ బారిక్‌ మైనింగ్‌ హెచ్చరించింది. దీనిపై సమీక్ష 2027 మధ్యకాలం వరకు కొనసాగనుంది.

ఐఎంఎఫ్‌ నిధుల కోసం ఎదురుచూపులు
మరోవైపు పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారీ అప్పుల భారం నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సాయంపై ఆధారపడుతోంది. అక్టోబర్‌లో ఐఎంఎఫ్‌తో సిబ్బంది స్థాయి ఒప్పందం కుదుర్చుకున్న పాక్‌.. తాజాగా సుమారు 1.2 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోదం లభిస్తే.. రెండు కార్యక్రమాల కింద పాకిస్థాన్‌కు అందే మొత్తం నిధులు 5.7 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి.

గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా ఏంటి?
2022లో గోల్డ్‌మన్‌ సాక్స్‌ 104 దేశాల ఆర్థిక పరిస్థితులపై రూపొందించిన నివేదికలో.. 2075 నాటికి చైనా, భారత్‌, అమెరికా, ఇండోనేషియా, నైజీరియా తొలి ఐదు స్థానాల్లో ఉంటాయని అంచనా వేసింది. పాకిస్థాన్‌ ఆరో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. అప్పటికి పాక్‌ వాస్తవ జీడీపీ 12.7 లక్షల కోట్ల డాలర్లకు, తలసరి జీడీపీ 27,100 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు జనాభా పెరుగుదలతో పాటు తగిన ఆర్థిక విధానాలు, బలమైన సంస్థల ఏర్పాటు వంటి అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పర్యావరణ విపత్తులు, ప్రజాకర్షక జాతీయవాద రాజకీయాలు ఈ వృద్ధికి ప్రధాన అడ్డంకులుగా మారవచ్చని గోల్డ్‌మన్‌ సాక్స్‌ హెచ్చరించింది. మొత్తంగా అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్‌.. ఖనిజ సంపదతో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ.. షెన్‌జెన్‌లో ఏం జరగబోతుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement