న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నవంబర్ 20 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో లోక్‌సభలో మహిళలకు కల్పించే 33 శాతం రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో అనుసంధానించే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక సమావేశాలు ముగిసిన అనంతరం డిసెంబర్ రెండో వారంలో శీతాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రస్తుతం లోక్‌సభలో 540 స్థానాలు ఉండగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసే సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు అవసరం. మొత్తం 540 మంది ఓటు వేస్తే 361 మంది మద్దతు కావాలి. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రస్తుతం 305 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.
ఎన్సీపీ (శరద్ పవార్)కు చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్దతు లభించినా, తృణమూల్ కాంగ్రెస్‌లోని 20 మంది అసమ్మతి ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు కూడా మద్దతిస్తారని ఊహించినా మొత్తం బలం 355కు మాత్రమే చేరుతుంది. అవసరమైన సంఖ్య కంటే మరో ఆరుగురు సభ్యుల మద్దతు తక్కువగా ఉంటుంది. అయితే మహిళా రిజర్వేషన్లతోపాటు లోక్‌సభ స్థానాలను రాష్ట్రాలవారీగా 50 శాతం పెంచే ప్రతిపాదనకు సూత్రప్రాయంగా మద్దతిస్తామని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నవంబర్ 14న ప్రకటించారు.
మరోవైపు, వర్షాకాల సమావేశాలను ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ ప్రభుత్వం వాటిని అధికారికంగా ముగించకపోవడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రత్యేక సమావేశాల అనంతరం వాటిని ప్రొరోగ్ చేసి, శీతాకాల సమావేశాల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
డిసెంబర్‌లో జరగనున్న శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం పనితీరుపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.


