సాక్షి, అమరావతి: ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2026(స్పెషల్ టెట్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పెషల్ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 32 పేపర్లకు సీబీటీ విధానంలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలో 64, తెలంగాణలో 3, చెన్నైలో 2, బెంగళూరులో 2, బరంపురం (ఒడిశా)లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు. హాల్టికెట్లను cse.ap.gov.in లేదా tet2dsc.apcfss.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఇన్ సర్వీస్ టెట్ కోసం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 68,420మంది ఉపాధ్యాయులు 83,015 దరఖాస్తులు సమర్పించారు.


