రోమ్: ఇటలీ ప్రభుత్వం విద్యారంగంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. పాఠశాలల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించడంతో పాటు.. మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ మూలాలున్న విద్యార్థుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయం ఇటలీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును వివక్షాపూరితమని విమర్శిస్తున్నాయి.
బిల్లుకు ఆమోదం: డిక్రీ స్కూలా పేరుతో తీసుకొచ్చిన ఈ విద్యా సంస్కరణ బిల్లుకు ఇటలీ దిగువ సభ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో 142 మంది సభ్యులు మద్దతు తెలిపారు. 112 మంది వ్యతిరేకించగా.. నలుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అంతకుముందు నవంబర్ 20న సెనేట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది.
30 శాతం పరిమితి: కొత్త నిబంధనల ప్రకారం మొదటి సంవత్సరం తరగతుల్లో విదేశీ మూలాలున్న విద్యార్థుల సంఖ్య 30 శాతానికి మించకూడదు. అయితే ఇటాలియన్ భాషపై తగిన పరిజ్ఞానం ఉన్న విద్యార్థులకు ఈ పరిమితి వర్తించదు. ఇలాంటి నిబంధనను 2010లోనే ప్రవేశపెట్టినప్పటికీ పలు ప్రాంతాల్లో అమలు కాలేదు.
తల్లిదండ్రులకు భాషా తరగతులు: ఇటాలియన్ విద్యావ్యవస్థలో పిల్లలు సులభంగా కలిసిపోయేందుకు వారి తల్లిదండ్రులకు కూడా ఇటాలియన్ భాషా తరగతులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఇమడటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల కుటుంబాలపై దృష్టి సారించనున్నారు.
బుర్ఖా, నిఖాబ్‌పై నిషేధం: కొత్త చట్టం ప్రకారం ముస్లిం బాలికలు తరగతి గదుల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే బుర్ఖా నిఖాబ్ ధరించడానికి వీలుండదు. అయితే ముఖం కనిపించేలా ఉండే హిజాబ్‌పై ఈ నిషేధం లేదు.
ప్రతిపక్షాల నిరసన: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గతంలోనే ఈ ఆంక్షలపై ప్రకటన చేశారు. ఇటాలియన్ విద్యార్థులు తమ తరగతి గదుల్లో మైనారిటీలుగా మారకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ‘పాఠశాలలో ఎవరూ విదేశీయులు కాదు’ అనే ప్లకార్డుతో నిరసన తెలిపారు.
ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియా, డెన్మార్క్ సహా యూరప్‌లోని పలు దేశాలు ఇప్పటికే ముఖాన్ని కప్పే వస్త్రాలపై ఆంక్షలు విధించాయి. వచ్చే ఏడాది ఇటలీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వలసలు, విదేశీ విద్యార్థుల అంశాలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: పాక్ నిధుల ఆరోపణలు.. కేంద్ర మంత్రికి ‘కాక్రోచ్’ లీగల్ నోటీసు


