టైటిల్: భోగి
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, శరత్ లోహితశ్వ తదితరులు
నిర్మాణ సంస్థ:శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత: కేకే రాధామోహన్
రచయిత, దర్శకత్వం: సంపత్ నంది
సంగీతం: భీమ్స్
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్
విడుదల తేది: నవంబర్ 27, 2026

కథేంటంటే..
1960ల కాలంలో తెలంగాణలోని ‘బొగ్గుల గుట్ట’అనే ఫిక్షనల్ విలేజ్‌లో జరిగే కథ ఇది. ఆ ఊరి పటేల్(శరత్ లోహితశ‍్వ) చెప్పిందే వేదం అక్కడ. గ్రామానికి ఏ సమస్య వచ్చిన పటేల్ ఆదుకుంటాడని ఊరంతా నమ్ముతుంది. ఊరికి ఆపద వచ్చిన ప్రతిసారి పటేల్ పూజలు చేస్తుంటాడు. అదే ఊరిలో ఐదుగురు చెల్లెలతో కలిసి కమ్మరి వృత్తి చేస్తూ జీవితం గడుతుంటాడు గంగ(శర్వానంద్). పెద్ద చెల్లికి ఓ సంబంధం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. అదే సమయంలో పటేల్ అప్పగించిన ఓ పని కోసం పాలెగాళ్లతో కలిసి అడవికి వెళ్తాడు. అక్కడ గంగకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటి? ఊరంతా ముఖం చూడడానికే భయపడే పటేల్‌కి గంగ ఎందుకు ఎదురుతిరగాల్సి వచ్చింది? మూఢనమ్మకంతో పటేల్ చేస్తున్న అరాచకపు పని ఏంటి? అది గంగ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసింది? దాన్ని గంగ ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో సులోచన(అనుపమ పరమేశ్వరన్), మందారం(డింపుల్ హయాతి) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఈ మధ్య సినిమాల్లో కథ కంటే కత్తులకే ఎక్కువ పని చెబుతున్నట్టుంది. ఎన్ని తలలు తెగితే అంత పెద్ద హిట్ అవుతుందన్న లెక్కలో దర్శకులు కొత్త కొత్త హింసాత్మక యాంగిల్స్‌ను వెతుకుతున్నారు. కానీ ప్రేక్షకుడిని కట్టిపడేసే కొత్త కథను చెప్పాలన్న ఆలోచన మాత్రం ఎక్కడో వెనుకబడిపోతోంది. ఆ మధ్య వచ్చిన ‘ప్యారడైజ్’లో హింస ఏ స్థాయిలో ఉందో చూశాం. ఇప్పుడు ‘భోగి’లో అంతకు మించి అన్నట్టుగా రక్తపాతాన్ని తెరపై ఆవిష్కరించారు.
నిజానికి హింసను కథలో భాగంగా, బలమైన భావోద్వేగాలతో ముడిపెట్టి చూపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారు. కానీ ఎలాంటి ఎమోషన్ లేకుండా, కేవలం షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో హింసను ఇష్టానుసారంగా జొప్పిస్తే మాత్రం అది ప్రేక్షకులకు వినోదం కాకుండా ఒకరకమైన హింసగానే మారుతుంది. అందుకు ‘భోగి’ ఓ మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకున్నా.. రక్తపాతం, హింసాత్మక సీన్లకే ఎక్కువ ప్రాధాన్య ఇవ్వడం.. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉండడంతో ఈ ‘భోగి’మంటను భరించలేకపోతాం.
సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే ఉంటుంది. బొగ్గుల గుట్ట గ్రామ నేపథ్యం, పటేల్‌కి ఇచ్చే ఎలివేషన్.. హీరో ఫ్యామిలీ నేపథ్యం..పాటలు.. ఇలా మొదటి అర గంట ఆసక్తికరంగానే ఉంటుంది. ఎప్పుడైతే హీరోకి పటేల్ చేసే అరాచకపు పని గురించి తెలుస్తుందో.. ఆ తర్వాత కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే ఎమోషనల్ సీన్లు కూడా సరిగా పండలేదు. ఇంటర్వెల్ సీన్‌తో ద్వితియార్థం ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడు అంచనా వేస్తాడు.
ఇక సెకండాఫ్‌లో హింస తప్ప ఇంకేమి ఉండదు. అవసరం లేని సన్నివేశాలు, అతిగా సాగదీసిన యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షగా మారుతాయి. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్ట్ కాస్త సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్ మొత్తం రొటీన్‌గానే సా..గుతుంది. దర్శకుడు సంపత్ నంది ఓ మంచి పాయించ్ ఎంచుకున్నా.. దాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం సఫలం కాలేదు.

ఎవరెలా చేశారంటే..
శర్వానంద్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సీన్లలోనూ మంచి ప్రతిభ కనబరిచాడు.తెలంగాణ యాసను కూడా బాగానే పలికాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు న్యాయం చేసింది. ఆమెకు ఒకటి, రెండు బలమైన సీన్లు పడ్డాయి. డింపుల్ హయాతి పాత్ర నిడివి తక్కువే అయిన ఉన్నంతలో బాగానే చేసింది. ఇక ఊరి పటేల్‌గా శరత్ లోహితశ్వతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈ సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫీ. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. చీకట్లో తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయి. భీమ్స్ అందించిన పాటలు బాగున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిభించేలా పాటలు ఉంటాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం యావరేజ్. కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


