మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో ఘటన
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెల్ఫీ దిగిన 17 ఏళ్ల భారతీయ టీనేజర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. కేరళలోని కొచ్చికి చెందిన రౌల్ జాన్ అజు అనే 17 ఏళ్ల టీనేజర్ ఏఐరియాల్మ్ టెక్నాలజీస్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కూడా ఇతడే. మాస్కోలో జరిగిన ఏఐ జర్మనీ కాన్ఫరెన్స్‌లో కంపెనీ తరఫున ఇతడు పాల్గొన్నాడు.
26వ తేదీన సదస్సుకు వచ్చిన అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడే అవకాశం ఇతడికి వచ్చింది. ఈ సందర్భంగా సెల్ఫీ దిగాలని ఉందన్న ఇతడి కోరికను పుతిన్ తీర్చేశారు. ‘సరదాగా వీడియోలు చేసుకునే చిన్న పిల్లాడి స్థాయి నుంచి 17 ఏళ్ల వయసులో అధ్యక్షుడు పుతిన్‌ను కలిసే స్థాయికి రావడం..నిజంగా నమ్మలేకపోతున్నాను. నేను కలలో సైతం ఊహించనన్ని అవకాశాలను జీవితం నాకు ఇచ్చింది’అని అజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా పేరు తెచ్చుకున్న అజు.. ‘నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చేయాల్సింది ఇంకా చాలా ఉంది’అని పేర్కొన్నాడు. ‘థింక్‌క్రాఫ్ట్ వేదికను రూపొందించిన భారతీయ విద్యార్థి రౌల్ జాన్ అజు, అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన సమావేశంలో సెల్ఫీ దిగారు’రష్యా ఎంబసీ పేర్కొంది. సదస్సులో భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన 300 మంది నిపుణులు పాల్గొన్నారు.


