పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం పాఠశాలలో తుపాకీ పేలిన ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి పాఠశాలకు తీసుకొచ్చిన నాటు తుపాకీ పేలడంతో 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి గాయపడ్డాడు. తిరుత్తాల సమీపంలోని పరుత్తూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 11.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తుపాకీ పేలడంతో విద్యార్థికి చంక భాగంలో, భుజం, చేయి మధ్య గాయమైంది. దాంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కొట్టక్కల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అయితే విద్యార్థికి తగిలిన గాయం తీవ్రంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
పాఠశాలకు తుపాకీ ఎలా వచ్చింది?
జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల ప్రాథమిక విచారణలో విద్యార్థి తుపాకీని పాఠశాలకు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అది నాటు తుపాకీ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు అసలు ఆ తుపాకీ అతడికి ఎక్కడి నుంచి వచ్చింది? విద్యార్థి దాన్ని పాఠశాలలోకి ఎలా తీసుకొచ్చాడు? అనే అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తుపాకీ ఏ పరిస్థితుల్లో పేలింది? కాల్పులకు దారితీసిన కారణాలేంటి? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: నాన్నను చంపేందుకే భద్రత తొలగించారు: రాహుల్ గాంధీ


