ఒట్టావా: అదృష్టం అంటే ఇదేనేమో! ఆరు నంబర్లు ఆమె జీవితాన్నే మార్చేశాయి. అనుకోకుండా కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్ కేరళకు చెందిన మహిళను ఏకంగా రూ.32 కోట్లకు అధిపతిని చేసింది. కెనడాలో నివసిస్తున్న భారతీయ ఇంజినీర్ స్నేహా జాయ్‌కు ఐదు మిలియన్ కెనడియన్ డాలర్ల భారీ జాక్‌పాట్ తగిలింది. అక్టోబర్ 21న జరిగిన లొట్టో 6/49 క్లాసిక్ డ్రాలో ప్రకటించిన 1, 10, 18, 22, 33, 37 నంబర్లన్నీ ఆమె టికెట్‌లో సరిపోవడంతో ఈ అపూర్వ అదృష్టం వరించింది. ధ్రువీకరణ అనంతరం శుక్రవారం లాటరీ అధికారులు ఆమెకు బహుమతిని అందజేశారు.
కేరళ నుంచి కెనడా వరకు..
ఎర్నాకుళం జిల్లా వెంగూర్‌కు చెందిన స్నేహా.. స్థానిక కాంగ్రెస్ నాయకుడు పిపి జాయ్, జాలీ జాయ్ దంపతుల ఏకైక కుమార్తె. ఐదేళ్ల క్రితం భర్త విజిల్ వర్గీస్‌తో కలిసి ఎడ్మంటన్‌కు వెళ్లారు. 2020లో వెంగూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు. లొట్టో స్పాట్ మొబైల్ యాప్‌లో టికెట్ కొనుగోలు చేసిన స్నేహాకు జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి తొలుత నమ్మలేకపోయారు. ఆశ్చర్యం, ఆనందం, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించిందని ఆమె చెప్పారు. ముందుగా కెనడాలోని ఇంటిపై ఉన్న రుణాన్ని పూర్తిగా తీర్చేస్తానని, ఆ తర్వాత ప్రపంచమంతా పర్యటిస్తానని ఆమె వెల్లడించారు. కుటుంబ సభ్యులతోనూ తన అదృష్టాన్ని పంచుకుంటానన్నారు. కుమార్తె అదృష్టంపై కేరళలోని ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్రార్థనలకు దక్కిన ఫలితంగా ఈ అదృష్టాన్ని భావిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: కిలోకు రూ.65 లక్షల పతనం.. వ్యాపారుల ప్రశంసలు!


