మనామా: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకూ విస్తరిస్తుండటంతో బహ్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇరాన్ తాజాగా బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించడంతో అక్కడి ప్రవాసుల్లో కలవరం నెలకొంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే అల్‌రిఫా ప్రాంతం పేరు తాజా పరిణామాల్లో ప్రస్తావనకు రావడంతో అక్కడి భారతీయ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అల్‌రిఫాతోపాటు ఒయాసిస్ కాలనీలోనూ పెద్ద సంఖ్యలో తెలుగు వారు నివసిస్తున్నారు. యుద్ధం ఎటువైపు నుంచి ఎలాంటి ముప్పును తెచ్చిపెడుతుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఉపాధి కోసం వేల కిలోమీటర్ల దూరంలోని గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగు వారిని ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి.
తెలుగు వారి అడ్డా.. అల్‌రిఫా
బహ్రెయిన్‌లోని అల్‌రిఫా ప్రాంతం ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి కీలక నివాస, వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు వారు ఇక్కడ స్థిరపడ్డారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే హోటళ్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో అల్‌రిఫా కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా తెలుగు వారి సామాజిక, వ్యాపార కార్యకలాపాలకు ముఖ్యమైన కేంద్రంగా మారింది. ఒయాసిస్ కాలనీలోనూ తెలుగు కుటుంబాలు గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నాయి. తాజా దాడుల వార్తలతో ఈ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
40 పబ్బుల్లో 30 భారతీయుల నిర్వహణలోనే..
అల్‌రిఫా ప్రాంతంలో సుమారు 40 వరకు పబ్బులు ఉన్నట్లు స్థానికుల అంచనా. వీటిలో దాదాపు 30 వరకు భారతీయుల నిర్వహణలో ఉండగా, వాటిలో 22 నుంచి 23 వరకు తెలుగు వారికి చెందినవిగా చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కడప తదితర ప్రాంతాలకు చెందిన వారు వీటిని నిర్వహిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బుల వ్యాపారాలతో తెలుగు వారి ఉనికి ఈ ప్రాంతంలో బలంగా ఉంది. స్థానికంగా ఏర్పడిన తెలుగు సమాజం కారణంగా ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన వారికి పరస్పర సహకారం కూడా లభిస్తోంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితోపాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లోనూ ఆందోళన నెలకొంది.
సౌదీ నుంచి వారాంతాల్లో సందడి
అల్‌రిఫా ప్రాంతానికి భౌగోళికంగానూ ప్రత్యేకత ఉంది. బహ్రెయిన్‌ను సౌదీ అరేబియాతో కలిపే సుమారు 25 కిలోమీటర్ల పొడవైన కింగ్ ఫహద్ కాజ్‌వే సముద్రంపై నిర్మితమైంది. ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియాలోని ఖోబర్ ప్రాంతానికి చేరుకోవచ్చు. దమ్మామ్ తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. అక్కడ వారాంతపు సెలవులు గురు, శుక్రవారాల్లో ఉండటంతో ఆ రోజుల్లో సౌదీ నుంచి అనేకమంది బహ్రెయిన్‌కు వస్తుంటారు. ముఖ్యంగా వినోదం, హోటళ్లు, పబ్బుల కోసం అల్‌రిఫా ప్రాంతానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని వ్యాపార కార్యకలాపాలు వారాంతాల్లో మరింత సందడిగా ఉంటాయి. ఇప్పుడు దాడుల వార్తలతో ఈ ప్రాంతానికి వచ్చే వారి రాకపోకలు, వ్యాపారాల భద్రతపైనా చర్చ జరుగుతోంది.
యుద్ధం ఎటువైపు దారితీస్తుందో?
బహ్రెయిన్‌లోని అల్‌రిఫా, అవాలి ప్రాంతాల్లో అమెరికా పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలకు అనుసంధానమైన రాడార్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. మరోవైపు ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నామని, వాటి శకలాల కారణంగా ఒక పౌర పారిశ్రామిక కేంద్రంలో మంటలు చెలరేగాయని బహ్రెయిన్ వెల్లడించింది. ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో భద్రతపై సహజంగానే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రవాసుల భద్రతపై ఆందోళన
మరోవైపు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ ప్రతిపాదిస్తున్న షరతులు ఆమోదయోగ్యంగా లేవని వ్యాఖ్యానించారు. ఖతార్ మధ్యవర్తిత్వంతోనూ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు ఆగకపోవడం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అల్‌రిఫా, ఒయాసిస్ కాలనీల్లో ఉన్న తెలుగు కుటుంబాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని, తమ వారు క్షేమంగా ఉండాలని స్వదేశంలోని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: Nigeria: పడవ ప్రమాదం.. 24 మంది జలసమాధి


