ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం | Eisenkot invites Netanyahu Likud for talks form Israel government | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం

Nov 22 2026 7:30 AM | Updated on Nov 22 2026 7:40 AM

Eisenkot invites Netanyahu Likud for talks form Israel government

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ కీలక అడుగు వేశారు. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు ఆయన ఆహ్వానం పంపారు. జాతీయ ఐక్యత ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయి.

ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యాషర్ పార్టీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. చర్చలను వేగవంతం చేయాలని తమ ప్రతినిధి బృందానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. ఇందులో భాగంగా నవంబర్ 22, ఆదివారం లికుడ్ ప్రతినిధులతో తొలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని యాషర్ పార్టీ స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ కష్టాలు
అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ కూటమికీ 120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీ లభించలేదు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. మాజీ సైనికాధికారి అయిన గాడి ఐసెన్‌కోట్‌కు 67 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లభించింది. ఇందులో ఆయన కూటమికి చెందిన 48 మంది, అరబ్ పార్టీలకు చెందిన 19 మంది సభ్యులు ఉన్నారు. డిసెంబర్ 6 వరకు ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది.

నెతన్యాహుకు వ్యతిరేకంగా బెన్నెట్ ప్రకటన
మరోవైపు మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ జాతీయ ఐక్యత ప్రభుత్వ ఏర్పాటుకు తన మద్దతును పునరుద్ఘాటించారు. ఐసెన్‌కోట్ నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడాలని స్పష్టం చేశారు. నెతన్యాహు మరోసారి ప్రధాని కాకుండా చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నెతన్యాహు నేతృత్వంలోని కూటమిలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చేరబోమని వెల్లడించారు. అయితే లికుడ్ పార్టీని ఐక్యత ప్రభుత్వంలో భాగస్వామిని చేయడంపై ప్రతిపక్ష కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బెన్నెట్ లికుడ్ భాగస్వామ్యానికి సుముఖంగా ఉండగా, అవిగ్డోర్ లీబర్‌మన్ మరో ప్రత్యామ్నాయ కూటమిని ప్రతిపాదిస్తున్నారు. యాయిర్ గోలన్ మాత్రం అరబ్ పార్టీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
ఐక్యత ప్రభుత్వానికి లికుడ్ షరతులు

ఐసెన్‌కోట్‌తో చర్చలకు సిద్ధమైనప్పటికీ లికుడ్ పార్టీ పలు షరతులను ముందుకు తెచ్చింది. అయితే నెతన్యాహునే ప్రధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌ను లికుడ్ తన ప్రకటనలో స్పష్టంగా ప్రస్తావించలేదు.

  • నెతన్యాహు, ఆయన ప్రభుత్వంపై రాజకీయ బహిష్కరణలు, వ్యక్తిగత విమర్శలకు ముగింపు పలకాలి.

  • ఇజ్రాయెల్ యూదు ప్రజల జాతీయ రాజ్యమనే అంశాన్ని ఉమ్మడిగా అంగీకరించాలి.

  • పాలస్తీనా దేశ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉండాలి.

  • గాజా, లెబనాన్, సిరియాల్లో ఇజ్రాయెల్ భద్రతా మండలాలను కొనసాగించాలి.

  • యెషివా విద్యార్థుల సైనిక సేవ, మినహాయింపుల అంశంపై అల్ట్రా ఆర్థడాక్స్ నాయకులతో విస్తృత ఒప్పందం కుదుర్చుకోవాలి.

ఇదీ చదవండి: జెలెన్‌స్కీ సొంత పట్టణంపై రష్యా క్షిపణి దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement