ఫోన్‌ సంభాషణ.. ఒకరిపై ఒకరు అరుచుకున్న ట్రంప్‌, నెతన్యాహు! | Trump and Netanyahu Shouted Over Iran War | Sakshi
Sakshi News home page

ఫోన్‌ సంభాషణ.. ఒకరిపై ఒకరు అరుచుకున్న ట్రంప్‌, నెతన్యాహు!

Nov 13 2026 12:31 AM | Updated on Nov 13 2026 12:31 AM

Trump and Netanyahu Shouted Over Iran War

వాషింగ్టన్ : ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుల మధ్య జరిగిన ఫొన్‌ సంభాషణకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని పునరుద్ధరించే అంశంపై ట్రంప్,  నెతన్యాహు మధ్య వాగ్వాదానికి దారి తీసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక దాడులను వెంటనే పునఃప్రారంభించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్ తన అణు సామర్థ్యాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఆ దేశ పాలకవర్గాన్ని పూర్తిగా కూలదోస్తేనే ఇజ్రాయెల్‌కు ఉన్న ఉనికి ముప్పు తొలగిపోతుందని నెతన్యాహు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు ప్రతిరోజూ ట్రంప్‌కు ఫోన్ చేసి యుద్ధాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

అయితే, అమెరికా మాత్రం ఇరాన్ విషయంలో భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇప్పటికే జరిగిన ఘర్షణల వల్ల అమెరికాలో రాజకీయంగా వ్యతిరేకత రావడంతో పాటు, దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్లపై పడుతున్న ప్రభావాన్ని ట్రంప్ యంత్రాంగం బేరీజు వేస్తోంది. అమెరికా చాలా పటిష్టమైన స్థానంలో ఉంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. హర్మూజ్‌ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని’ వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి భారీ స్థాయి యుద్ధాలు, దాడుల అవసరం లేదని అమెరికా భావిస్తుండటంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక ఘర్షణ తలెత్తింది.

ఫోన్ కాల్‌లో తారాస్థాయికి విబేధాలు 
వారాంతంలో ఇరు నేతలు మాట్లాడుకున్న సమయంలో ఈ భిన్న ధృవాల వైఖరి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు కేకలు వేసుకునే స్థాయికి ఈ సంభాషణ దిగజారిందని మీడియా కథనాలు హైలెట్‌ చేశాయి. నెతన్యాహు కార్యాలయం మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఫోన్‌ సంభాషణ అంత తీవ్రంగా జరగలేదని, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని సీనియర్ ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నారు.

ట్రంప్, నెతన్యాహు మధ్య అభిప్రాయభేదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జూన్ నెలలోనూ ఇరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, నెతన్యాహును ట్రంప్  పిచ్చివాడు అంటూ తీవ్ర పదజాలంతో దూషించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఇరాన్‌తో మళ్లీ యుద్ధానికి దిగితే ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడాల్సి వస్తుందని ట్రంప్ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో రాజకీయంగా నెతన్యాహు తన మనుగడ కోసం పోరాడుతుండగా, అమెరికా మాత్రం పశ్చిమాసియాలో కొత్త యుద్ధాల జోలికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం, దాని అత్యంత సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్‌ దేశాల మధ్య పొరపొచ్చలు చర్చకు దారి తీశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement