వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ఇరాన్‌తో యుద్ధం, తదనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి (డెఫెన్స్ సెక్రటరీ) పీట్ హెగ్సెత్ పదవికి ముప్పు ముంచుకొచ్చింది. స్వపక్షానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడే ఆయనపై అభిశంసన అస్త్రం సంధించడం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కెంటకీకి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాస్సీ .. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ఏకంగా ఎనిమిది అభిశంసన ఆర్టికల్స్‌ను సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌తో అక్రమంగా యుద్ధానికి వెళ్లడం, రక్షణ శాఖాధిపతిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ప్రధాన ఆరోపణలతో ఈ అభిశంసన ప్రతిపాదనను తెచ్చినట్లు మాస్సీ తెలిపారు.
ఈ పరిణామం ఇరాన్ యుద్ధ వ్యవహారంలో రిపబ్లికన్ పార్టీలోని అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. మరోవైపు ఈ అభిశంసన ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వ్యతిరేకించారు. రాయిటర్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఆయన (హెగ్సెత్) రెండు యుద్ధాల్లో గెలిచారు. అలాంటి వ్యక్తిని మీరెలా అభిశంసించగలరు?’ అంటూ సమర్థించారు.
మిడిల్ ఈస్ట్ దేశాలను, ఇజ్రాయెల్‌ను కాపాడిన రక్షణ మంత్రిని తొలగించడం సరికాదన్నారు.అలాగే హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. అంతర్జాతీయంగా శత్రువులు, మిత్రదేశాల ముందు ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తనపై వస్తున్న అభిశంసన విమర్శలను పీట్ హెగ్సెత్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి పదవికి రాజీనామా చేసేది లేదని, ఈ రాజకీయ వ్యూహాలు తనపై పనిచేయవని స్పష్టం చేశారు. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాబట్టి తనను దోషిగా తేల్చడం అంత సులభం కాదని, తాను దీనికి భయపడటం లేదని తేల్చిచెప్పారు.
ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల చేతిలో రిపబ్లికన్లు ఎదురుదెబ్బ తగలడానికి ఇరాన్ యుద్ధంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరిలో కాంగ్రెస్‌పై పూర్తి పట్టు సాధించేందుకు డెమొక్రాట్లు సిద్ధమవుతున్న తరుణంలో ఈ అభిశంసన పోరు తెరపైకి రావడం గమనార్హం.అంతేకాకుండా, ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ రక్షణ వ్యయ ప్యాకేజీ ఆమోదం పొందే విషయంలోనూ ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చని కొందరు రిపబ్లికన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చరిత్రలో 1876 నాటి విలియం బెల్నాప్ ఉదంతాన్ని మినహాయిస్తే కేబినెట్ కార్యదర్శుల అభిశంసన మందగమనే చెప్పాలి. అయితే, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నడుమ పీట్ హెగ్సెత్ భవిష్యత్తు ఏ విధంగా ఉండనుందనేది అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


