అమెరికా: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫోస్టర్ కేర్‌లో (రక్షణ గృహాల్లో) పెరుగుతున్న పిల్లల ఉన్నత విద్య కోసం భారీ స్కాలర్‌షిప్ నిధిని ప్రకటించారు. వారి చదువులు, ఇతర అవసరాల కోసం 7.2 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.60 కోట్లకు పైగా ఆమె కేటాయించారు. నవంబర్ 7న లూసియానా స్టేట్-అలబామా యూనివర్సిటీల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫోస్టర్ కేర్ వ్యవస్థలో పెరిగిన యువతకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మెలానియా ‘ఫోస్టరింగ్ ది ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా అమెరికా దేశవ్యాప్తంగా 26 విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీంతో విద్యార్థులకు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అవసరాలకు కూడా ఆమె ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఈ సందర్భంగా మెలానియా మాట్లాడుతూ.. ఫోస్టర్ కేర్ నుంచి వచ్చిన యువతకు స్థిరమైన భవిష్యత్తు, నాణ్యమైన విద్యతో పాటు జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశాన్ని ఈ స్కాలర్‌షిప్‌లు కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్య ఒక వ్యక్తికి ఎవరూ దూరం చేయలేని గొప్ప ఆస్తి అని అన్నారు. కార్యక్రమంలో స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడి ఫొటోలు దిగారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా FSSAI దాడులు.. రూ.81 కోట్ల విలువైన ఆహార పదార్థాలు సీజ్


