ఇల్లినాయ్‌ అసెంబ్లీకి సబా హైదర్‌ | India-born Saba Haider wins Illinois State Representative election | Sakshi
Sakshi News home page

ఇల్లినాయ్‌ అసెంబ్లీకి సబా హైదర్‌

Nov 7 2026 6:24 AM | Updated on Nov 7 2026 6:24 AM

India-born Saba Haider wins Illinois State Representative election

పుట్టింది ఔరంగాబాద్‌లో 

వివాహం తరువాత 2006లో అమెరికాకు

న్యూయార్క్‌/ఘాజియాబాద్‌: అమెరికా మధ్యంతర ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో పుట్టి అమెరికా వెళ్లిన సబా హైదర్‌ను హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ప్రతినిధిగా మార్చేశాయి. ఇల్లినాయ్‌లోని 84 డిస్ట్రిక్ట్ నుంచి జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన సబా ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన బ్రియాన్‌ స్కోపాపై ఘన విజయం సాధించారు. డెమొక్రాట్‌ అభ్యర్థి సబాకు ఏకంగా 70.9 శాతం ఓట్లు దక్కగా.. బ్రియాన్‌ 29.1 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘‘మనం సాధించాం. 

15 నెలలుగా డిస్ట్రిక్ట్‌ 84లోని మూల మూలల్లోని ఓటర్లతో మాట్లాడుతున్నాం. మీ కోసం పనిచేస్తామని భరోసా ఇచ్చాం. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నాం. ఇల్లినాయిలోని ప్రజలందరినీ కలుపుకుని వాటిని సాధించడం ఎలా అన్నది కూడా వివరించాం’’అని సబా హైదర్‌ విజయానంతరం వ్యాఖ్యానిస్తూ చెప్పారు. ఇది ప్రజల విజయమని, అందరికీ సమాన అవకాశాలు లభించే ఇల్లినాయిస్‌ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.  

ఇల్లినాయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు సబా డుపేజ్‌ కౌంటీ బోర్డ్‌ మెంబర్, కమ్యూనిటీ అడ్వకేట్‌గా పనిచేశారు. సబా తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లా ఔరంగాబాద్‌కు చెందిన వారు. సబా కూడా అక్కడే జన్మించారు. 2006లో కంప్యూటర్‌ ఇంజనీర్‌ అలీ కజ్మీని వివాహమాడి అమెరికాకు వలస వెళ్లారు. ‘‘అప్పటి నుంచి సమాజానికి నా వంతు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నా. 

నన్ను నా కుటుంబాన్ని ఆదరించిన ఇల్లినాయ్‌ని ఇల్లుగా మార్చుకున్నా’’అంటారు సబా. అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ నుంచి వైల్డ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ విద్యను అభ్యసించిన సబా గోల్డ్‌ మెడల్‌ సాధించారు. యోగా శిక్షకురాలిగా సామాజిక జీవితాన్ని ప్రారంభించారు. సబా సాధించిన ఘన విజయంపై యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం అభినందనలు తెలిపింది. తమకెంతో గర్వకారణమైన విజయమని కొనియాడింది.  

సామర్థ్యం, నమ్మకాలే గెలిపించాయి... 
సబా విజయం పట్ల ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది కేవలం ఒక మైనారిటీ గుర్తింపుతో వచ్చిన విజయం కాదు.. ఆమె ప్రతిభ, ఆత్మవిశ్వాసం, విద్యకు దక్కిన గౌరవం‘ అని ఆమె సోదరుడు అబ్బాస్‌ హైదర్‌ పేర్కొన్నారు. నేపథ్యం, కులం, సామాజిక వర్గం వంటివేవీ పనిచేయవని, విద్యావంతులై, ప్రజాసేవ స్ఫూర్తితో పనిచేయాలని సంకల్పిస్తే ఎక్కడైనా ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని అన్నారు. ఘజియాబాద్‌లో సొంత వ్యాపారం నిర్వహిస్తున్న అబ్బాస్‌ సోదరి విజయంపై ఆనందాన్ని అందరితో పంచుకోవడంలో బిజీగా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement