లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌గా నిత్యా రామన్‌  | Nithya Raman History as First Indian American Elected Mayor of Los Angeles | Sakshi
Sakshi News home page

లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌గా నిత్యా రామన్‌ 

Nov 7 2026 6:12 AM | Updated on Nov 7 2026 6:12 AM

Nithya Raman History as First Indian American Elected Mayor of Los Angeles

చరిత్ర సృష్టించిన డెమొక్రాటిక్‌ సోషలిస్టు నేత  

నగరంలో మొట్టమొదటి భారతీయ–అమెరికన్, దక్షిణాసియా మేయర్‌గా రికార్డు 

డిసెంబర్‌ 14న బాధ్యతల స్వీకరణ  

న్యూయార్క్‌/చెన్నై: భారత్‌లో జన్మించిన అమెరికా డెమొక్రాటిక్‌ సోషలిస్టు నాయకురాలు నిత్యా రామన్‌ చరిత్ర సృష్టించారు. అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. లాస్‌ ఏంజెలెస్‌ సిటీకి మొట్టమొదటి భారతీయ–అమెరికన్, మొట్టమొదటి దక్షిణాసియా మేయర్‌గా రికార్డుకెక్కారు. 

లాస్‌ ఏంజెలెస్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా పని చేస్తున్న 45 ఏళ్ల నిత్యా రామన్‌ ఈ నెల 3న జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి, మేయర్‌ 73 ఏళ్ల కరెన్‌ బాస్‌ను ఓడించారు. 52 శాతం ఓట్లు సాధించారు.

డిసెంబర్‌ 14న మేయర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ విజయంతో అమెరికాలోని అతిపెద్ద రెండు నగరాలైన న్యూయార్క్, లాస్‌ ఏంజెలెస్‌లు ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన, డెమొక్రాటిక్‌ సోషలిస్ట్‌ భావజాలం కలిగిన మేయర్ల పాలనలోకి వచ్చాయి. న్యూయార్క్‌ మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ పని చేస్తున్న సంగతి తెలిసిందే. తన విజయం పట్ల నిత్యా రామన్‌ సంతోషం వ్యక్తంచేశారు. 

లాస్‌ ఏంజెలెస్‌ ప్రజలకు ‘ఎక్స్‌’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘మీ తదుపరి మేయర్‌గా ఎన్నికవ్వడం నాకు ఎంతో గౌరవప్రదమైన విషయం. నాకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టిన, సందేశాలు పంపిన, ఫోన్‌ కాల్స్‌ చేసిన వేలాది మందికి ధన్యవాదాలు. మనమంతా నివసిస్తున్న ఈ విశాలమైన, అందమైన, సంతోషకరమైన నగరాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవాలి’’అని రామన్‌ గురువారం పోస్టుచేసిన వీడియోలో పేర్కొన్నారు.

 ‘‘మీ నమ్మకాన్ని గెలుచుకోవడానికి, అలాగే ఈ నగరంపై మీకు మళ్లీ నమ్మకం కలిగేలా చేయడానికి నేను ప్రతిరోజూ సిటీ హాల్‌కు వెళ్లి పనిచేయబోతున్నాను. ఈ కృషి ఇప్పుడే మొదలవుతుంది. తద్వారా మనం ప్రజలకు అందుబాటు ధరలో గృహాలను, పిల్లలు ఆడుకోవడానికి పార్కులను, ప్రజలు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలం. సురక్షితమైన నగరాన్ని, ఇచ్చిన హామీలను నెరవేర్చగల సామర్థ్యం గల నగర పాలనా యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి’’అని ఉద్ఘాటించారు. లాస్‌ ఏంజెలెస్‌ మొదటి మహిళా మేయర్‌గా కరెన్‌ బాస్‌ అందించిన సేవలను నిత్యా రామన్‌ కొనియాడారు.  

చెన్నైలోనే రాజకీయ పాఠాలు  
నిత్యా రామన్‌ 1981 జూలై 28న కేరళంలోని త్రిసూర్‌లో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. నిత్యా రామన్‌ ప్రాథమిక, కళాశాల విద్యను అమెరికాలోనే పూర్తిచేశారు. 2010లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి సిటీ ప్లానింగ్‌లో మాస్టర్స్‌ పట్టా పొందారు. 

అనంతరం చెన్నైకి తిరిగి వచ్చారు. 2010 నుంచి 2013 వరకు చెన్నైలోనే ఉన్నారు. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఆధ్వర్యంలో ‘ట్రాన్స్‌పరెంట్‌ చెన్నై’అనే ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించారు. చెన్నై వీధుల్లో, కూవం నది ఒడ్డున, నంగనల్లూరు శివారు ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. మురికివాడలు, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. చెన్నైలో నదులు, కాలువల వెంబడి ఉన్న మురికివాడల తొలగింపును ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నిత్యా రామన్‌ అక్కడి పేదలకు అండగా నిలిచారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement