ట్రంప్‌కు అగ్నిపరీక్ష నేడే  | Donald Trump Faces Crucial Test As Democrats Target Control Of Congress | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు అగ్నిపరీక్ష నేడే 

Nov 3 2026 6:05 AM | Updated on Nov 3 2026 6:05 AM

Donald Trump Faces Crucial Test As Democrats Target Control Of Congress

మధ్యంతర ఎన్నికలకు అమెరికా సిద్ధం

ఏడు రాష్ట్రాల్లో హోరాహోరీ

వాషింగ్టన్‌: నేడు(మంగళవారం) అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలు అధ్యక్ష స్థానానికి కాకపోవచ్చు కానీ.. అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ భవిష్యత్తును నిర్ణయించేవి. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత రెండేళ్లుగా ట్రంప్‌ విధానాలు, వైఖరికి ప్రజలిస్తున్న తీర్పు కూడా. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరిగితే.. రెండేళ్లకు ఒకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435, సెనేట్‌లో 35 స్థానాలు, అనేక రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు పోటీ జరగనుంది. 

అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో జరిగే ఎన్నికలు కావడంతో ఓటర్లు ప్రభుత్వ పనితీరుపై ఇచ్చే అభిప్రాయంగానూ వీటిని పరిగణిస్తారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై, నవంబరు 4న ఉదయం 9.30 గంటల వరకు కొనసాగనుంది. అమెరికాలోని ఆరు కాలమానాల కారణంగా రాష్ట్రాలవారీగా పోలింగ్‌ సమయాల్లో తేడా ఉంటుంది. ఫలితాలు పోలింగ్‌ ముగిసిన తర్వాత వెలువడతాయి; అయితే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల రాత్రే ఫలితం స్పష్టం కాకపోవచ్చు. 

2025 జనవరిలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు అమెరికాలోని రెండు సభల్లో (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌)నూ రిపబ్లికన్లదే ఆధిక్యం. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది కానీ.. అప్పటికి, ఇప్పటికీ చాలా తేడాలున్నాయి. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లు 220 మంది ఉండగా డెమోక్రాట్ల సంఖ్య 215గా ఉండింది. సెనేట్‌ విషయానికి వస్తే ట్రంప్‌ పార్టీకి 53 మంది, ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో డెమోక్రాట్లకు 47 మంది మద్దతుండేది. 

ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలకు ముందు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లు 218 మంది కాగా, డెమోక్రాట్లు 214 మంది. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సెనేట్‌ పరిíస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీ సెనేట్‌లో తన పట్టు నిలబెట్టుకోగలదా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. డెమోక్రాట్లు ఆధిక్యం సంపాదించగలిగితే అధ్యక్షుడి విధాన నిర్ణయాలను సమర్థంగా సవాలు చేయగల అవకాశం లభిస్తుంది. ఒకవేళ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఆధిక్యం సాధించినా ట్రంప్‌కు కష్టకాలమే.  

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు మొత్తం ప్రస్తుతమున్న 218 స్థానాలను నిలబెట్టుకోగలిగితే చాలు. ఆధిక్యం కావాలంటే డెమోక్రాట్లు నికరంగా నాలుగు స్థానాల్లో విజయం సాధించాలి. సెనేట్‌ విషయానికి వస్తే.. రిపబ్లికన్లు పోటీలో ఉన్న 35 స్థానాల్లో 20 – 22 గెలిచి, డెమోక్రాట్లు 13 – 15 స్థానాలు గెలిస్తే సభలో రిపబ్లికన్ల ఆధిక్యం కొనసాగుతుంది. ఇలా కాకుండా రిపబ్లికన్లు 19 స్థానాలు మాత్రమే గెలుచుకున్నా ఫర్వాలేదు. ఇరుపక్షాలకు చెరి సగం సీట్లు దక్కుతాయి కాబట్టి ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్‌ నిర్ణయాత్మక ఓటు వేయగలుగుతారు. రిపబ్లికన్ల సీట్లు 19 కంటే తక్కువైతే మాత్రం సెనేట్‌లో డెమోక్రాట్లకు ఆధిక్యం లభిస్తుంది.  

ప్రస్తుత పరిస్థితి ఏమిటి?  
మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ లాభపడిన సందర్భాలు అమెరికా రాజకీయ చరిత్ర మొత్తమ్మీద లేనేలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి కాలం నుంచి పరిశీలించినా ప్రతినిధుల సభలో అధికార పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయినట్లు స్పష్టమవుతుంది. ఈ లెక్కన చూస్తే.. రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు కఠిన పరీక్షే. కాకపోతే ఈ సారి చరిత్రను మారుస్తామన్న ధీమా రిపబ్లికన్లలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ ఎన్నికల ఫలితాలు దేశం మొత్తమ్మీద కాకుండా.. కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాలపైనే ఆధారపడి ఉంది. ఒహాయో, టెక్సాస్, నార్త్‌ కరోలినా, మెయిన్, మిషిగన్, అలాస్కా, ఐయోవా రాష్ట్రాల్లో సెనేట్‌ స్థానాల కోసం హోరాహోరీ పోరు ఉంది. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో గెలుపోటముల నిర్ణయం స్వింగ్‌ డిస్ట్రిక్ట్స్‌గా పిలిచే ఉప నగర ఓటర్లపై ఆధారపడి ఉంది. ఎందుకంటే గత పదేళ్లలో వీరు అటు నుంచి ఇటుకు, ఇటు నుంచి అటుకు మారుతూవచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement