ఆధార్ బదులు ఓటర్ ఐడీ వివాదం
కేంద్రంపై రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల లబ్ధదారుల గుర్తింపు కోసం ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లల్లన్ సింగ్) చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య కేవలం ‘‘ఓట్ల చోరీ’’మాత్రమే కాదని, పేదల ‘‘హక్కుల చోరీ’’అని ఆయన శుక్రవాం విమర్శించారు.
సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన ఒక పోస్టు చేస్తూ... ఇది మోదీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని అరోపించారు. కొంత సమయం తీసుకునైనా దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పేరుతో కోట్లాది పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు దీన్ని అడ్డుకోకుండా మరింత మందిని తొలగిస్తారు. ఎవరి పేర్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారు? బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వారివి.’’అని ఆయన హిందీలో రాసిన పోస్టులో వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలు నిస్పాక్షికమైన ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉండాలని, కానీ ఇప్పుడు అవి మోదీ ప్రభుత్వ ఉద్యోగి ‘జ్ఞానేశ్ కుమార్’చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు.
బీజేపీకే నిత్యం ఆధిక్యం లభించేలా ఒక కొత్త ఓటరు జాబితా తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ అధికారం నుంచి దిగిపోవాలని నిర్ణయించుకుంటే చాలు.. వారి పేర్లను తీసేస్తున్నారు. ‘‘పేర్లు కొట్టేస్తున్నారు... ఓటు.. హక్కులు.. పోతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. ‘‘అలా మీరు హైజాకైన ప్రజాస్వామ్యంలో కంటికి కనిపించని పౌరుల్లా మారిపోతారు. ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోరు.. ప్రభుత్వుమే ప్రజలను ఎంచుకుంటంది’’అని విమర్శించారు.
ఓటరు ఐడీల ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధి ఇవ్వడం ఇప్పుడు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖతో మొదలైనా భవిష్యత్తులో రేషన్, ఫించన్లు, ఉపాధి హమీ పథకం, హౌసింగ్, స్కాలర్íÙప్పులు, రిజర్వేషన్లకూ విస్తరించవచ్చునని ఆరోపించారు. ‘‘ఇవి ఎన్నికల్లో గెలించేందుకు చేస్తున్న రాజకీయాలు కాదు. ఎన్నికల చోరీ ద్వారా శాశ్వతంగా అధికారానికి పట్టుకుని వేలాడేందుకు చేస్తున్న ఏర్పాటు’’అని విమర్శించారు. ‘‘ఓటింగ్ మీ హక్కు. షరతు కాదు. పేద వ్యక్తి పింఛన్‌ను ఓటరు ఐడీకి బానిసలా చేయకూడదు. ఇది ఓటు చోరీ మాత్ర మే కాదు.. హక్కుల చోరీ’’అని ధ్వజమెత్తారు.


