మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి
తిరస్కరణకు గురైన ఇతరుల నామినేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో ఇతరులెవరూ లేకపోవడంతో పురిని రిటరి్నంగ్ అధికారి ఉమేష్ కుమార్ శర్మ విజేతగా ప్రకటించారు. అనంతరం, పురి తరఫున ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్ అందుకున్నారు.
అయితే, హర్దీప్ సింగ్ పురి నామినేషన్ పత్రాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని అంతకుముందు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. పరిశీలన అనంతరం రిటరి్నంగ్ అధికారి ఆ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చారు. మరోవైపు, కాంగ్రెస్ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి రాజ్‌కుమార్ లోహానీ నిబంధనల ప్రకారం ఫాం–26 అఫిడవిట్‌ను గడువులోగా దాఖలు చేయకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
అదేవిధంగా, మరో స్వతంత్ర అభ్యర్థి కాంతే సయన్నాకు అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను కూడా పక్కనబెట్టారు. దీంతో, హర్దీప్ సింగ్ పురి ఒక్కరే బరిలో నిలిచారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ అధిష్టానం అక్టోబర్ 28న హర్దీప్ సింగ్ పురిని అభ్యర్థిగా ప్రకటించగా, అక్టోబర్ 31న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. ప్రత్యర్థుల నామినేషన్లు చెల్లకుండా పోవడం, కాంగ్రెస్ వ్యూహం విఫలం కావడంతో హర్దీప్ సింగ్ పురి ఏకగ్రీవం సునాయాసమైంది.


