రాజ్యసభ బరిలో పురి  | BJP Names Hardeep Singh Puri for MP Rajya Sabha By-Election | Sakshi
Sakshi News home page

రాజ్యసభ బరిలో పురి 

Oct 29 2026 5:26 AM | Updated on Oct 29 2026 5:26 AM

BJP Names Hardeep Singh Puri for MP Rajya Sabha By-Election

మధ్యప్రదేశ్‌ నుంచి గెలుపు లాంఛనమే 

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ:  మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ తరఫున కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి బరిలో దిగనున్నారు. పార్టీ అధినాయకత్వం బుధవారం ఈ మేరకు ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ ఆ పదవితో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన పదవీకాలం 2030 ఏప్రిల్‌ దాకా ఉంది. మురుగన్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆ రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్‌ 2 తుది గడువు. నవంబర్‌ 12న పోలింగ్, అదే సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఎన్నిక ప్రక్రియ నవంబర్‌ 16 నాటికి పూర్తవుతుంది. 

పదవి పదిలమే:  ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పురి పదవీకాలం 2026 నవంబర్‌ 25న ముగుస్తుంది. యూపీలో అక్టోబర్‌ మొదట్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను బీజేపీ తిరిగి నామినేట్‌ చేయలేదు. దాంతో పురి మంత్రి పదవి పోనుందని ఉహాగానాలు వచ్చాయి. కానీ అనూహ్యంగా మురుగన్‌ రాజీనామాతో మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానంలో ఆయనకు అవకాశం దక్కింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన అక్కడ ఎన్నిక నల్లేరుపై నడకే కానుంది. 

పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో: ఆప్‌ పాలిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2027 మార్చిలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అక్కడ ఎలాగైనా అధికారం చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. పంజాబ్‌ రాజకీయాల్లో, సిక్కుల సమస్యలపై గళమెత్తే నేతల్లో ముఖ్యుడైన పురిని ఈ సమయంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించకపోవచ్చన్న అంచనాలే చివరికి నిజమయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన పురి కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా చేతిలో ఓటమి పాలయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement