Photo Credit: Twitter
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27లో ఆయా జట్ల బ్యాటర్లు డబుల్ సెంచరీలు, శతకాలతో హోరెత్తిస్తున్నారు. ఎలైట్ గ్రూప్-ఏలో జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ ఆయుశ్ బదోని డబుల్ సెంచరీతో చెలరేగగా, సుమిత్ మాథూర్ సెంచరీ సాధించాడు. తద్వారా ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతుంది. ప్రస్తుతం 126 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. బదోని (201), సుమిత్ మాథూర్ (118) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా రికార్డు స్థాయిలో 293 పరుగులు జోడించడం విశేషం.
నిహాల్ ద్విశతకం
ఎలైట్ గ్రూప్-డిలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చండీగఢ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. 118 ఓవర్లు ముగిసేసరికి చండీగఢ్ 2 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. ఓపెనర్ నిహాల్‌పజిని (324 బంతుల్లో 202 బ్యాటింగ్; 23 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా, అరస్లాన్ ఖాన్ (99) పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
ప్రియాన్షు డబుల్.. మహేశ్ సెంచరీ
ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా బ్యాటర్ ప్రియాన్షు మోలియా ద్విశతకం మార్క్ సాధించాడు. 354 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన ప్రియాన్షు ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ప్రస్తుతం బరోడా 128 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది. మహేశ్ పితియా కూడా 210 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఏడో వికెట్‌కు ఈ జోడి అజేయంగా 233 పరుగులు జోడించింది.
పటీదార్ శతకం..
ఇక ఎలైట్ గ్రూప్-ఏలో బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పటీదార్ శతకం సాధించాడు. 133 బంతుల్లో 109 పరుగులు చేసిన పటీదార్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అంతకముందు వికెట్ కీపర్ సాక్షమ్ పురోహిత్ (132) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 407 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బీహార్ 99 పరుగులకే కుప్పకూలడంతో, మధ్యప్రదేశ్ 308 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.
పంజాబ్ 431 ఆలౌట్
ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 431 పరుగులకు ఆలౌటైంది. సలీల్ అరోరా (151) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, చివర్లో రమన్‌దీప్ సింగ్ (52) అర్థసెంచరీ సాధించాడు. చివర్లో ఉమేశ్ యాదవ్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ నాలుగు వికెట్లతో చెలరేగగా, రక్షణ్ మూడు వికెట్లు, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డిలు ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి:


