నాగ్‌పూర్‌లో జరిగిన మహిళల అండర్ 19 టోర్నమెంట్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోరింగ్ లోపం కారణంగా జార్ఖండ్ జట్టు పరుగు తేడాతో ఓటమి పాలయ్యింది. స్కోర్‌బోర్డ్ ఆపరేటర్ చేసిన పొరపాటు కారణంగా తాము విజయానికి దూరం కావాల్సి వచ్చిందంటూ జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం (JSCA) ఆరోపణలు చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అధికారికంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
విషయంలోకి వెళితే.. మహిళల అండర్-19 టోర్నీలో భాగంగా ఈ నెల 20న జార్ఖండ్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగింది. ఉత్తరాఖండ్ విధించిన 134 టార్గెట్‌ను జార్ఖండ్ ఛేదించే పనిలో పడింది. క్రీజులో లక్ష్మీ కుమారి, ఇషికా భగత్ ఉన్నారు. చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతుల్లో మూడు పరుగులు తీసిన తర్వాత, కుమారి రనౌటయ్యింది.
అయితే రనౌట్‌కు ముందే సింగిల్ తీసినప్పటికీ, దానిని స్కోరుబోర్డు ఆపరేటర్ పెద్దస్క్రీన్‌పై జత చేయలేదు. అయితే చివరి మూడు బంతుల్లో మూడు పరుగులు చేసినప్పటికీ, జార్ఖండ్ పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే స్కోర్ ఆపరేటర్ చేసిన తప్పిదం వల్ల పరుగు తేడాతో తాము ఓటమిపాలైనట్లు జార్ఖండ్ క్రికెట్ బోర్డు గమనించింది.
ఆ వెంటనే ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి లేఖ రాసింది. తప్పును సరిదిద్దమని జట్టు ప్రధాన స్కోరర్‌ను కోరినప్పటికీ, నాగ్‌పూర్ స్టేడియం మ్యాచ్ అధికారి మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదని జేసీఏ అధికారి ఒకరు పేర్కొన్నారు.
స్కోర్‌బోర్డ్‌ను భౌతికంగా ఆపరేట్ చేసే వ్యక్తిపై ఆధారపడకుండా, అధికారిక స్కోరర్ అందించిన సమాచారాన్ని అంపైర్లు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరముందని సదరు అధికారి బీసీసీఐ ఎదుట వాపోయారు. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: ఇషాన్‌కు గాయం నిజమేనా? అడ్డంగా దొరికిన బీసీసీఐ!


