‘ఇలా చేస్తే మూడో టీ20లో పాత భువీని చూడొచ్చు’ | Irfan Pathan Offers Key Advice To Bhuvneshwar Kumar Ahead Of Third T20I Against New Zealand, Hopes To See Old Bhuvi Return | Sakshi
Sakshi News home page

‘ఇలా చేస్తే మూడో టీ20లో పాత భువీని చూడొచ్చు’

Oct 27 2026 8:42 AM | Updated on Oct 27 2026 9:50 AM

Irfan Pathan Key-Advice-For-Bhuvneshwar Kumar Ahead 3rd T20I Vs NZ

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి రెండు టీ20ల్లో పూర్తిగా తేలిపోయాడు. రెండు మ్యాచ్‌లు కలుపుకొని 99 పరుగులిచ్చుకున్న భువీ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. స్వింగ్ కింగ్‌గా పేరున్న భువనేశ్వర్‌లో మునుపటి పదును కనిపించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. 

వయసు మీద పడడంతో అతడి బౌలింగ్‌లో పస తగ్గిపోయిందనే  కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌.. మూడో టీ20కి ప్రారంభానికి ముందు భువీకి కీలక సూచన చేశాడు. 

‘మొదటి రెండు మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ బౌలింగ్‌ను గమనిస్తే.. ఎక్కువగా షార్ట్ బంతులు కనిపించాయి. అయితే ఇక్కడ భువీ సుమారు 7 నుంచి 7.5 మీటర్ల దూరంలో బంతులు విసరడంతో మంచి లైన్ అండ్ లెంగ్త్‌లోనే పడుతున్నాయి. అయితే బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యమున్న భువనేశ్వర్ బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేయగలడు. 

అయితే జాతీయ జట్టుకు ఆడి నాలుగేళ్లు కావొస్తుండడంతో భువీపై ఒత్తిడి ఉండడం సహజం. అందుకే అతడి బౌలింగ్‌లో స్వింగ్ పదును తగ్గి రక్షణాత్మక బౌలింగ్ కనిపిస్తుంది. ముందు నుంచి చూసుకున్నా భువనేశ్వర్ దూకుడుగా బంతులు వేయలేడు. కానీ తన స్వింగ్ నైపుణ్యంతో వికెట్లు రాబట్టగలడు. 

ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా మొదటి ఓవర్ వేస్తున్న భువనేశ్వర్‌ కొత్త బంతితో స్వింగ్‌ను రాబడుతూనే లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తే ఫలితం వచ్చే అవకాశముంటుంది. మూడో టీ20లో పాత భువీని చూస్తాననుకుంటున్నా’అని చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి రెండు టీ20లలో గెలిచిన భారత్‌.. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

ఇదీ చదవండి: 99 పరుగులు ఇచ్చుకున్న భువీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement