సిరీస్‌ విజయమే లక్ష్యంగా... | Indias third T20 against New Zealand today | Sakshi
Sakshi News home page

సిరీస్‌ విజయమే లక్ష్యంగా...

Oct 27 2026 2:47 AM | Updated on Oct 27 2026 2:47 AM

Indias third T20 against New Zealand today

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ మూడో టి20

దూకుడు మీదున్న టీమిండియా

మధ్యాహ్నం గం. 12:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

వెలింగ్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై శ్రేయస్‌ అయ్యర్‌ బృందం ఇక్కడ అడుగు పెట్టినప్పుడు సుదీర్ఘ ప్రయాణపు అలసట, ఒకే ఒక ప్రాక్టీస్‌ సెషన్‌ కారణంగా జట్టుపై అంచనాలు పెద్దగా లేవు. కానీ స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించిన టీమిండియా 226, 181 పరుగుల లక్ష్యాలను ఛేదించి 2–0తో పైచేయి సాధించింది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగితే భారత్‌కు తిరుగుండదు. ఇక్కడ ఆడిన గత రెండు సిరీస్‌లలో భారత్‌ 5–0, 1–0తో విజయం సాధించింది. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ వరుసగా మూడో సిరీస్‌ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని జట్టు భావిస్తోంది. 

మరోవైపు స్వదేశంలో తిరుగులేని జట్టుగా కనిపించే కివీస్‌ సిరీస్‌ చేజార్చుకునే ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్‌లోనైనా ఆ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందా అనేది చూడాలి. ‘ప్రపంచంలో అత్యంత వేగంగా గాలులు వీచే’ నగరంగా గుర్తింపు ఉన్న వెలింగ్టన్‌లో రాత్రి పూట (స్థానిక సమయం 8 గంటలు) చలితో గాలి మరింత ప్రభావం చూపిస్తుంది. దీనిని అధిగమించి పరుగులు సాధించడం, బౌలింగ్‌ చేయడం భారత్‌కు పెద్ద సవాల్‌. మ్యాచ్‌ వేదిక అయిన హెన్రీ స్టేడియంలో పిచ్‌ ఇరు వైపుల బౌండరీలు బాగా చిన్నవే అయినా భారీ స్కోర్లు తక్కువే నమోదయ్యాయి. మ్యాచ్‌ రోజు స్వల్ప వర్ష సూచన కూడా ఉంది. ఈ మైదానంలో పురుషుల అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ జరిగి 20 ఏళ్లు దాటింది.

మార్పుల్లేకుండా... 
తొలి రెండు మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. కోచ్‌ గంభీర్‌ టాప్‌–5 రెగ్యులర్‌ బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులకు ఇష్టపడటం లేదు. సామ్సన్, అభిషేక్‌ శర్మ, శ్రేయస్, తిలక్‌ వర్మలతో పాటు ఇషాన్‌ గైర్హాజరులో వైభవ్‌ సూర్యవంశీకి మరో చాన్స్‌ ఖాయం. పిచ్, పరిస్థితులను బట్టి ఆల్‌రౌండర్ల విషయంలో మార్పులకు ఆస్కారం ఉన్నా... ఈ మ్యాచ్‌లో దానికీ అవకాశం లేదు. ఈ మైదానంలో స్పిన్నర్‌కంటే ఒక అదనపు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఉపయోగపడవచ్చు. అయితే దూబే వేసే ఓవర్లకంటే నమన్‌ ధీర్‌ దూకుడైన బ్యాటింగ్‌నే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్ముతోంది. ఏడు లేదా ఎనిమిదో స్థానంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెలరేగుతుండటం జట్టుకు సానుకూలాంశం.  

రెండు మార్పులతో... 
సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌ కాస్త గందరగోళ స్థితిలో కనిపిస్తోంది. రెండుసార్లూ విజయావకాశాలు సృష్టించుకున్నా... వాటిని సమర్థంగా జట్టు వాడుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను కాపాడుకోవడం కివీస్‌కు ఎంతో కీలకం. పని భారం కారణంగా ఇద్దరు టాప్‌ పేసర్లు ఫెర్గూసన్, హెన్రీలకు ఈ మ్యాచ్‌ నుంచి టీమ్‌ విశ్రాంతి కల్పించింది. వీరి స్థానాల్లో ఆడే మిల్నే, జేమీసన్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ముఖ్యం. 

స్పిన్‌లో సాంట్నర్, బ్రేస్‌వెల్‌ చక్కటి ఆటతీరు కనబర్చారు. అయితే అసలైన బ్యాటింగ్‌లోనే మాత్రం టీమ్‌ తడబడుతోంది. రెండు అర్ధసెంచరీలతో గ్లెన్‌ ఫిలిప్స్‌ రాణించగా, రెండో టి20లో జాకబ్స్‌ రాణించాడు. విధ్వంసకర ఓపెనర్లుగా గుర్తింపు పొందిన అలెన్, సీఫెర్ట్‌లనుంచి సరైన ఆరంభం రాకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. మిచెల్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. బ్యాటింగ్‌లో కివీస్‌ను గెలిపించేదెవరనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement