PC: BCCI X
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తరఫున మైదానంలో అడుగుపెట్టాడు భువనేశ్వర్ కుమార్. కివీస్‌తో ఇప్పటికి జరిగిన రెండు మ్యాచ్‌లలో కలిపి ఈ వెటరన్ పేసర్.. ఏకంగా 99 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక వికెట్ తీయగలిగాడు.
విమర్శల వర్షం
దీంతో పునరాగమనంలో భువీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడంటూ అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ యూపీ బౌలర్ ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో ఆర్సీబీని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భువీ దాదాపు నాలుగేళ్ల తర్వాత జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ ఇవ్వగలిగాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టాడు.. కానీ
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ‘‘భువనేశ్వర్ కుమార్ పునరాగమనం అందరికీ సంతోషానిచ్చింది. అయితే, నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు.. కాబట్టి అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
నిజానికి ఐపీఎల్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, అంచనాలు ఒక్కోసారి ఒత్తిడిని కూడా పెంచుతాయి. భువీ దానిని అధిగమించాల్సి ఉంది. అతడు కేవలం నెల రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడటం మిగతా వాటికి కాస్త భిన్నంగా ఉంటుంది.
వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు
షెడ్యూల్ కారణంగా అతడికి ప్రాక్టీస్ చేసేందుకు ఎక్కువ సమయం దొరకలేదు. అయితే, అతడి నైపుణ్యం, అనుభవం కచ్చితంగా జట్టుకు ఉపయోగపడతాయి. భువీ నిలదొక్కుకునేందుకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. భువీ కచ్చితంగా ఆటను మెరుగుపరచుకుని.. పూర్వపు లయను అందుకుంటాడు.
కాబట్టి బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని మోర్నీ మోర్కెల్ 36 ఏళ్ల భువీకి అండగా నిలిచాడు. కాగా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి రెండు టీ20లలో గెలిచిన భారత్.. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి ఈ మ్యాచ్‌కు వెల్లింగ్‌టన్ వేదిక.
చదవండి: బాత్‌రూమ్ వరకు కూడా నడవలేక.. చచ్చిపోతానని భయపడ్డాను!


