Photo Credit: BCCI Twitter
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియాను గెలిపించడంపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ హర్షం వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడిన దినేశ్ కార్తిక్.. తిలక్ వర్మ, నితీశ్‌లను ఆకాశానికి ఎత్తాడు. తెలుగు కుర్రాళ్లిద్దరు ఇరగదీశారని, క్లిష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారని దినేశ్ కార్తిక్ కొనియాడాడు.
దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘160 నుంచి 180 మధ్య స్కోరు నమోదయ్యే న్యూజిలాండ్ పిచ్‌లపై భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా రెండో టీ20లో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో అదరగొట్టారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడిని జయించి.. లక్ష్య ఛేదనలో మ్యాచ్‌ను ముందుండి నడిపించే సత్తా తిలక్ వర్మకు ఉంది.
ప్రారంభంలో 9 బంతుల్లో 10 పరుగులు చేసినప్పటికీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా సాధించిన హాఫ్ సెంచరీ తిలక్ ప్రత్యేకతను తెలియజేస్తోంది. ఛేదనలో ఉండే ఒత్తిడిని జయించి మ్యాచ్‌లు గెలిపించడం తిలక్ వర్మకు అలవాటుగా మారిపోయింది. ఇక ఆల్‌రౌండర్ నితీశ్‌రెడ్డి కూడా తన కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడనంలో సందేహం లేదు.
నమన్ ధీర్ ఉన్నది కాసేపే అయినా అతడి ఇంపాక్ట్ జట్టు విజయానికి ఉపయోగపడింది. కేవలం బౌండరీల వర్షం కురిసే పిచ్‌ల కంటే 160 నుంచి 180 పరుగుల స్కోర్లు వచ్చే పిచ్‌లపైనే అసలైన టీ20 పోటీ కనిపిస్తుంది. ఇటువంటి పిచ్‌లపై ఏ బంతిని బాదాలి, ఏ బౌలర్‌ను టార్గెట్ చేసుకోవాలి అనే ఆలోచన బ్యాటర్లకు అవసరం’ అని చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్, బేవాన్ జేకబ్స్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చగా.. భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ రెడ్డి తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సంజూ శాంసన్ (17 బంతుల్లో 14), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 27) నిరాశపరిచారు. ఈ తరుణంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు తోడైన ఆల్‌రౌండర్ నమన్ ధీర్ మెరుపు ఇన్నింగ్స్ (17 బంతుల్లో 31) ఆడాడు. తిలక్ వర్మ 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. నితీశ్ రెడ్డి 13 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నాలుగు వికెట్లు తీశాడు.
When Dinesh Karthik Speak In Telugu..❤️ @DineshKarthik https://t.co/6YJX8IUI6s
— Indian Clicks (@IndianClicks) October 24, 2026
ఇదీ చదవండి: 'నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే'


