source: X
స్వదేశంలో భారత్ చేతిలో వరుసగా రెండు టీ20ల్లో ఓడి, సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న న్యూజిలాండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రెండో టీ20లో కాలి కండరాల బిగుతుతో ఇబ్బందిపడిన అతడు, వన్డే సిరీస్ కోసం నవంబర్ 2న ఆక్లాండ్‌లో జట్టుతో చేరనున్నాడు.
పనిభారాన్ని నియంత్రించేందుకు..
మరో పేసర్ లాకీ ఫెర్గూసన్ మూడో టీ20కి అందుబాటులో ఉండడం లేదు. చివరి రెండు మ్యాచ్‌లకు అతడు జట్టుతో చేరతాడు. కైల్ జేమీసన్ దేశవాళీ టోర్నీలో ఆడేందుకు చివరి రెండు టీ20లకు దూరమవుతాడు. అనంతరం వన్డే జట్టులో చేరతాడు.
పేసర్ల పనిభారాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపాడు. బ్లెయిర్ టిక్నర్ చివరి మూడు టీ20లకు, జోష్ క్లార్క్సన్ చివరి రెండు మ్యాచ్‌లకు జట్టుతో చేరనున్నారు.
కాగా, నిన్న జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ జోడీ గెలవడం కష్టమనుకున్న మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించింది. ఈ సిరీస్‌లోని మూడో టీ20 అక్టోబర్ 27న జరుగనుంది.
ఇదీ చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్, నితీశ్ రెడ్డి మెరుపులు.. భారత్ గెలుపు


