నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్‌, నితీశ్‌ రెడ్డి మెరుపులు.. భారత్‌ గెలుపు | IND vs NZ 2nd T20I: Tilak Nitish Shines India Won In Last Over Thriller | Sakshi
Sakshi News home page

IND vs NZ: నరాలు తెగే ఉత్కంఠ.. తిలక్‌, నితీశ్‌ రెడ్డి మెరుపులు.. భారత్‌ గెలుపు

Oct 24 2026 4:12 PM | Updated on Oct 24 2026 4:30 PM

IND vs NZ 2nd T20I: Tilak Nitish Shines India Won In Last Over Thriller

తిలక్‌ వర్మ- నితీశ్‌ రెడ్డి (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా అద్భుత రీతిలో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

గ్లెన్‌ ఫిలిప్స్‌, బేవాన్‌ జేకబ్స్‌ అర్ధ శతకాలు
క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా శనివారం నాటి రెండో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. టాపార్డర్‌లో ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (7), ఫిన్‌ అలెన్‌ (16)... డారిల్‌ మిచెల్‌ (6) విఫలమైనా.. గ్లెన్‌ ఫిలిప్స్‌, బేవాన్‌ జేకబ్స్‌ అర్ధ శతకాలతో అదరగొట్టారు.

గ్లెన్‌ ఫిలిప్స్‌ 43 బంతుల్లోనే 70 పరుగులు చేయగా.. జేకబ్స్‌ 46 బంతుల్లో 58 పరుగులు రాబట్టాడు. మిగిలిన వారిలో మైకేల్‌ బ్రేస్‌వెల్‌ ధనాధన్‌ దంచి కొట్టాడు. కేవలం రెండు బంతుల్లోనే ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ బాది 10 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆదిలోనే ఎదురుదెబ్బలు
టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు కూల్చగా.. భువనేశ్వర్‌ కుమార్‌, ప్రిన్స్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (17 బంతుల్లో 14), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 27) నిరాశపరిచారు.

వన్‌డౌన్‌లో వచ్చిన వైభవ్‌ సూర్యవంశీ (4), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (7), అక్షర్‌ పటేల్‌ (11) విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మకు తోడైన ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (17 బంతుల్లో 31) ఆడాడు. అయితే, సాంట్నర్‌ బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌ వెనుదిరగడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.

హైదరాబాదీల సత్తా
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు క్రికెటర్లు వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి కలిసి గెలుపు దిశగా జట్టును నడిపించారు. వీరిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. ఇద్దరూ కలిసి విజయ లాంఛనం పూర్తి చేశారు.

ధనాధన్‌ దంచికొట్టి
తిలక్‌ వర్మ 25 బంతుల్లో అర్ధ శతకం (26 బంతుల్లో 51; ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు) పూర్తి చేసుకోగా.. నితీశ్‌ రెడ్డి 13 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ బాది 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. తిలక్‌- నితీశ్‌ కలిసి 30 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు. ఇక కివీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. జేకబ్‌ డఫీ, నాథన్‌ స్మిత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: IND vs NZ: తిలక్‌ వర్మ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement