ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సంచలన విషయాలు వెల్లడించాడు. ఒకానొక సమయంలో తాను అనారోగ్యంతో చచ్చిపోతానని భయపడినట్లు తెలిపాడు. అయితే, దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగిందని.. కెరీర్ కొనసాగించే అవకాశం దొరికిందని పేర్కొన్నాడు.
టెస్టులలో మేటి క్రికెటర్‌గా
పాకిస్తాన్‌లో జన్మించిన 39 ఏళ్ల ఖవాజా ఆస్ట్రేలియాలో స్థిరపడి.. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆసీస్ తరఫున తన కెరీర్‌లో 88 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 6229, వన్డేల్లో 1554, టీ20లలో 241 పరుగులు ఉన్నాయి.
ఇక 2011లో అరంగేట్రం చేసిన ఖవాజా.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ‘సబర్’ పేరిట తన జీవిత చరిత్రను పుస్తకం రూపంలో తీసుకువస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘ఆస్ట్రేలియన్ స్టోరీ’తో మాట్లాడిన ఉస్మాన్ ఖవాజా యువకుడిగా ఉన్నపుడు తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి వెల్లడించాడు.
బాత్‌రూమ్ వరకు కూడా నడవలేక.. చచ్చిపోతానేమోనని భయపడ్డాను
‘‘22వ ఏట నాకు రుమటాయిడ్ ఆర్థరైటస్ ఉన్నట్లు తేలింది. ఎడమ మోకాలి నొప్పితో విలవిల్లాడేవాడిని. ఆ సమయంలో నేను చచ్చిపోతానేమోనని భయపడ్డాను. అథ్లెట్.. ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన నేను.. పది మీటర్ల దూరంలో ఉన్న బాత్‌రూమ్‌కి కూడా నడవలేకపోయాను.
అయితే, నాకున్న ఈ సమస్య గురించి నా ప్రాణ స్నేహితులు డేవిడ్ వార్నర్, మైక్ హస్సీలకు కూడా తెలియనివ్వలేదు. అనారోగ్యం గురించి అందరికీ చెప్పి సానుభూతి, ప్రత్యేక ట్రీట్‌మెంట్ కావాలని కోరుకోలేదు. ఏదేమైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో ఓ వ్యక్తి ఉన్నత స్థాయిలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడంటే.. ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడనే నమ్మకం పెరిగింది.
ఆ దేవుడి దయ వల్లే
నిజంగా దేవుడే నాకోసం కొన్ని మందులను సృష్టించాడని భావించాను. ఒక డ్రగ్ ఉండేది. అది వాడకపోయి ఉంటే.. నేను మళ్లీ ఇలా సాధారణ జీవితం గడపగలిగేవాడిని కాదు. అసలు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా కొనసాగేవాడినే కాదు’’ అని ఉస్మాన్ ఖవాజా ఉద్వేగానికి లోనయ్యాడు.


